Home General సోమవారం నుంచి కొత్త రూల్స్ సిమ్ కార్డులపై కేంద్రం నిబంధనలు

సోమవారం నుంచి కొత్త రూల్స్ సిమ్ కార్డులపై కేంద్రం నిబంధనలు


తొమ్మిది సిమ్‌లకు మించి ఇక నో.

మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆగస్టు 24, 2026 నుంచి ఒక వ్యక్తి పేరుతో ఉన్న సిమ్ కార్డుల సంఖ్యను టెలికాం సంస్థలు మరింత కఠినంగా తనిఖీ చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఒక వ్యక్తి పేరుతో గరిష్ఠంగా 9 మొబైల్ కనెక్షన్లు మాత్రమే ఉండొచ్చు. ఇప్పటికే 9 కనెక్షన్లు ఉన్న వ్యక్తి మరో కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేస్తే దాన్ని తిరస్కరించాలని టెలికాం సంస్థలకు కేంద్రం ఆదేశించింది. జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం గరిష్ఠ పరిమితి 6 కనెక్షన్లుగా ఉంది. ఈ పరిమితి అన్ని టెలికాం సంస్థలు, దేశంలోని అన్ని లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియాలకు కలిపి వర్తిస్తుంది.

ముందుగా గుర్తింపు.. తర్వాత పూర్తి నియంత్రణ

కొత్త విధానంలో భాగంగా వినియోగదారుడి పేరుతో ఇప్పటికే ఉన్న కనెక్షన్లను గుర్తించే వ్యవస్థను టెలికాం కంపెనీలు అమలు చేయాలి. ఆగస్టు 23 నుంచి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లో గరిష్ఠ పరిమితికి చేరుకున్న వినియోగదారుల ఫొటోలను అందుబాటులో ఉంచనున్నారు. సంస్థలు ఈ సమాచారాన్ని ప్రతిరోజూ డౌన్‌లోడ్ చేసుకుని కొత్త సిమ్ కోసం వచ్చే వ్యక్తులను గుర్తించాలి. ప్రారంభంలో ఈ తనిఖీ పోస్ట్‌-ఫ్యాక్టో విధానంలో జరుగుతుంది. అంటే సిమ్ యాక్టివేషన్ తర్వాత కూడా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. పరిమితికి మించి కనెక్షన్ యాక్టివేట్ అయితే సమస్య పరిష్కారమయ్యే వరకు దాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని కేంద్రం సూచించింది. కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో వ్యక్తి పేరుతో ఇప్పటికే ఉన్న కనెక్షన్ల వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది.

నవంబర్ 30 నుంచి రియల్ టైమ్ చెక్

ప్రస్తుతం అమలులోకి వస్తున్న వ్యవస్థకు తుది రూపం త్వరలో రానుంది. నవంబర్ 30, 2026 నాటికి సిమ్ జారీ చేసే సమయంలోనే రియల్ టైమ్‌లో తనిఖీ చేసే వ్యవస్థను టెలికాం సంస్థలు ఏర్పాటు చేయాలి. అంటే ఒక వ్యక్తి ఇప్పటికే గరిష్ఠ పరిమితికి చేరుకున్నాడా లేదా అన్నది సిమ్ యాక్టివేషన్‌కు ముందే తెలిసిపోతుంది. పరిమితి దాటితే కొత్త కనెక్షన్ ఇవ్వకుండా నేరుగా నిరాకరించాలి. ఈ చర్యల వెనుక అక్రమ కనెక్షన్లు, నకిలీ గుర్తింపులతో తీసుకునే సిమ్‌లు, టెలికాం దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యం ఉంది. ఇకపై ఒకే వ్యక్తి పేరుతో ఎక్కువ సిమ్‌లు తీసుకునే అవకాశం గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే తమ పేరుతో ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో వినియోగదారులు ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

 

#SIMCardRules #NewSIMRules #SIMCardLimit #9SIMCards #TelecomRules #IndiaTelecom #MobileConnections #SIMVerification #DigitalIntelligencePlatform #DepartmentOfTelecommunications #DoT #TelecomNews #SIMCardNews #RealTimeVerification #IndiaNews