Home Inter National News తొమ్మిది నెలల తర్వాత ఫ్యామిలీతో భేటీ

తొమ్మిది నెలల తర్వాత ఫ్యామిలీతో భేటీ


సుప్రీంకోర్టు ఆదేశాలతో కలిసిన ఇమ్రాన్‌ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొమ్మిది నెలల తర్వాత తొలిసారి కుటుంబ సభ్యులను కలిశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయన తన భార్య బుష్రా బీబీ, సోదరి నూరీన్ నియాజీని కలిశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉన్నారు. ప్రస్తుతం అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో 14 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం కావడంతో కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి భేటీకి పాకిస్థాన్ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ ఏడాదిలో తొలిసారి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఆయనకు లభించింది.

15 నిమిషాల పాటు సోదరితో

ఇమ్రాన్ ఖాన్ సోదరి నూరీన్ నియాజీ ఆయనను సుమారు 15 నిమిషాల పాటు కలిశారు. జైలు కాన్ఫరెన్స్ రూమ్‌లో జరిగిన ఈ భేటీలో ఇమ్రాన్ ఆరోగ్యం, ఇతర అంశాలపై మాట్లాడినట్లు జైలు వర్గాలను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా తెలిపింది. సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ను వైద్య పరీక్షల కోసం షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని ఇచ్చిన ఆదేశాల గురించి కూడా నూరీన్ ఆయనకు వివరించారు. అయితే ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్, బంధువు ఖాసిం జమాన్‌ను కలవడానికి అనుమతించలేదు. ఆయన పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు కూడా భేటీకి అవకాశం ఇవ్వలేదు.

బుష్రా బీబీతో ప్రత్యేక భేటీ

ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ కూడా అదే జైలులో ఉన్నారు. ఆమె మంగళవారం కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జైలు వర్గాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్‌తో బుష్రా బీబీ భేటీ సుమారు 30 నుంచి 35 నిమిషాల పాటు జరిగింది. బుష్రా తన పిల్లలు మూసా, ముబష్షిరా మనేకా, వదిన మెహ్రున్నిసాను కూడా కలిశారు. ఇదిలా ఉండగా, కుటుంబ భేటీలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఇచ్చిన వెసులుబాటును రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇమ్రాన్ ఆరోగ్యంపై మరోసారి విచారణ జరగనున్న సెప్టెంబర్ 16 వరకు వైద్య చికిత్సపై కోర్టు నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

 

#ImranKhan #ImranKhanFamily #BushraBibi #PakistanPolitics #PakistanSupremeCourt #AdialaJail #ImranKhanNews #ImranKhanHealth #AlQadirTrustCase #PakistanNews #FormerPM #SupremeCourt #PoliticalNews #WorldNews #Pakistan