Home AP దిగజారుడు రాజకీయం – మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం

దిగజారుడు రాజకీయం – మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం

43

హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా మంత్రిని ‘మేకప్ మంత్రి’ అని సంబోధించడం ఆమెను మాత్రమే కాకుండా యావత్ మహిళా లోకాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. రాజకీయాల్లో విభేదాలు ఉంటే విధానాలపై చర్చించాలి తప్ప మహిళల రూపం, దుస్తులపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళలు రాజకీయాల్లోకి రాకుండా నిరుత్సాహపరుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు సమన్లు జారీ
మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని మహిళా కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించింది. దీనితో పాటు విచారణకు హాజరుకావాలంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు బుధవారం నాడు అధికారికంగా సమన్లు జారీ చేయనున్నట్లు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వెల్లడించారు.