రేవంత్‌కు హరీశ్ బహిరంగ లేఖ
తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేయడమేనా అని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే భూములను అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. రాయదుర్గం భూ వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖ రాశారు.
10.63 ఎకరాలపై అభ్యంతరం
రాయదుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని హరీశ్‌రావు తెలిపారు. ఈ భూములపై అనేక వివాదాలు ఉన్నాయని, హక్కులు ఎవరికి చెందుతాయో తేలకముందే వేలం వేయడం ఎందుకని ప్రశ్నించారు. సుమారు రూ.2,000 కోట్ల విలువైన భూములను విక్రయించే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. 2020లో ఇదే భూములను రక్షించాలని కోరుతూ అప్పటి ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భూములపై మరో వైఖరి ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరో మాటనా అని నిలదీశారు. హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం వాటినే వేలం వేయడానికి ఎందుకు తొందరపడుతోందని ప్రశ్నించారు.
కోర్టు పరిధిలో ఉన్నా వేలం ఎందుకు?
ఇదే సర్వే నంబర్‌లో గతంలో 6.2 ఎకరాలను ఎకరాకు సుమారు రూ.237 కోట్ల చొప్పున వేలం వేయగా ఎస్‌బీఐ కోర్టును ఆశ్రయించిందని హరీశ్‌రావు తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. అయినా అదే సర్వే నంబర్‌లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్లో ఒక్క ఇంచు కూడా అమ్మబోమని గతంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను విక్రయించబోమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన మాటలకు విలువ లేదా అని ప్రశ్నించారు. భూముల వేలంపై రేవంత్‌రెడ్డి వైఖరి ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వేలం ఆపి సమగ్ర విచారణ జరపండి
సర్వే నంబర్ 83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్ర విచారణ జరపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హక్కులు, వివాదాలు తేలకముందే భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న వేలాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను అమ్మడం దారుణమని హరీశ్‌రావు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా పాలన సాగించాలని సూచించారు. లేకపోతే చరిత్రలో చెడ్డ పేరుతో మిగిలిపోతారని హెచ్చరించారు.
#Rayadurg #RayadurgLandAuction #HarishRao #RevanthReddy #TelanganaPolitics #GovernmentLands #HeritageLand #TelanganaLandAuction #RayadurgLand #BRS #TelanganaGovernment #Hyderabad #LandAuction #TelanganaNews #HarishRaoLetter











