చర్చలు జరగాల్సిన చోట రచ్చే రచ్చ.
పార్లమెంట్ అంటే దేశ సమస్యలకు పరిష్కారం వెదికే వేదిక. ప్రజల గొంతు వినిపించాల్సిన చోటు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.. సమాధానాలు రాబట్టాలి. కానీ ఈసారి వర్షాకాల సమావేశాల్లో కనిపించింది మాత్రం అందుకు పూర్తి భిన్నమైన దృశ్యం. చర్చ కంటే రచ్చ ఎక్కువైైంది.. చట్టాల కంటే నినాదాలు ఎక్కువయ్యాయ్. ప్రజా సమస్యల కంటే వాయిదాలే ఎక్కువయ్యాయ్ ! జూలై 20న మొదలైన సమావేశాలు చివరకు లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదాతో ముగిశాయి. ప్రభుత్వం 12 బిల్లులు ఆమోదం పొందాయని విజయంగా చెప్పుకుంటోంది. కానీ సభలో నిజంగా ఎంత పని జరిగిందన్న లెక్క చూస్తే అసలు బొమ్మ బయటపడుతోంది. లోక్సభ ఉత్పాదకత కేవలం 19 శాతం.. రాజ్యసభది 39.17 శాతం! అంటే ప్రజల డబ్బుతో నడిచే పార్లమెంట్ విలువైన సమయం భారీగా వృథా అయిందన్న మాట. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలు, ఇతర రాజకీయ అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. చర్చకు అవకాశం ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనకు ప్రతిపక్షం అభ్యంతరం చెప్పింది. నినాదాలు, నిరసనలు, వాయిదాలతో సభలు పదేపదే స్తంభించాయి. రాజ్యసభలో చైర్మన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. 285 స్టార్డ్ ప్రశ్నల్లో కేవలం 16కే అవకాశం దక్కడం పరిస్థితికి అద్దం పడుతోంది. 12 బిల్లులు పాస్ అయ్యాయన్నది ఒక లెక్క అయితే.. ప్రజల కోసం ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయన్నదే అసలు లెక్క! ప్రజల నమ్మకానికి వేదిక కావాల్సిన పార్లమెంట్.. ఈసారి గందరగోళానికి వేదికగా మిగిలిపోయిందా అన్న ప్రశ్న ఇప్పుడు దేశం ముందు నిలిచింది.
#Parliament #ParliamentMonsoonSession #MonsoonSession2026 #LokSabha #RajyaSabha #ParliamentDisruptions #ParliamentProtests #ParliamentProductivity #IndianDemocracy #NEETPaperLeak #OppositionProtests #ParliamentNews #IndianPolitics #ParliamentSession #India











