Home AP భూమి–భూమి హక్కుకు భరోసా! రాజముద్రతో రైతుల చేతికి పాస్‌పుస్తకం

భూమి–భూమి హక్కుకు భరోసా! రాజముద్రతో రైతుల చేతికి పాస్‌పుస్తకం


‘భూమి–భూమి హక్కు’ లో సీఎం చంద్రబాబు.

ఏలూరు జిల్లా కైకలిండిలో నిర్వహించిన ‘భూమి–భూమి హక్కు’ పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తైన తర్వాత నల్లజెర్ల దుర్గాభవాని అనే మహిళా రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాన్ని సీఎం అందించారు. అనంతరం గ్రామసభకు హాజరైనట్లుగా రిజిస్టర్‌లో సంతకం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత పాలనలో రికార్డులు ధ్వంసం కావడంతో అనేక భూములు వివాదాల్లో చిక్కుకున్నాయని ఆరోపించారు. ఇష్టంలేని వ్యక్తుల భూములను నిషేధిత 22ఏ జాబితాలో చేర్చి సమస్యలు సృష్టించారని విమర్శించారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా వచ్చిన భూ ఫిర్యాదులపై దృష్టి పెట్టి, అంశాల వారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.

పాస్‌పుస్తకాలకు హైటెక్‌ భద్రత

రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించేందుకు పాస్‌పుస్తకాల్లో కరెన్సీ తరహా భద్రతా లక్షణాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో భూముల వివరాలను ట్యాంపరింగ్‌ చేయకుండా రక్షణ కల్పించినట్లు చెప్పారు. క్యూఆర్‌ కోడ్‌ సహా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 32.32 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందించినట్లు తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మరో 68.64 లక్షల పాస్‌పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని చెప్పారు. 41 వేల ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి 1.47 లక్షల మందికి పైగా రైతులకు పట్టాలు ఇచ్చామని వివరించారు. ఏలూరు జిల్లాలోనే 5,500 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. ప్రతి రైతుకు రాజముద్రతో పాస్‌పుస్తకం అందించే వరకు విశ్రమించబోమన్నారు.

రైతులకు కొత్త సదుపాయాలు

భూమి యజమానులకు లింక్‌ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అందిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటివరకు 9 లక్షల మందికి ఆటోమ్యుటేషన్‌ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. రూ.10 లక్షల్లోపు విలువైన వారసత్వ భూములను కేవలం రూ.100తో బదిలీ చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. గ్రామసభల్లో పూర్తి పారదర్శకతతో పాస్‌పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. ఐటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో పౌరసేవలను మరింత సులభతరం చేస్తున్నామని పేర్కొన్నారు. కైకలూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో దెబ్బతిన్న రహదారులను సిమెంట్‌ రోడ్లుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వంపై రూ.1,150 కోట్ల అదనపు భారం పడుతున్నా రైతుల ప్రయోజనం కోసం భరిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

 

#BhoomiBhoomiHakku #ChandrababuNaidu #AndhraPradesh #LandRights #LandRecords #PattadarPassbook #APFarmers #FarmerLandRights #APGovernment #LandReforms #APLandRecords #22ALands #BlockchainLandRecords #DigitalLandRecords #Kaikaluru #EluruDistrict #APRevenue #LandSurvey