Home Cultural & Devotional గురుపౌర్ణమి ప్రవచనంతో ఆధ్యాత్మిక చైతన్యం.. భక్తులను అలరించిన బాల సౌజన్యకుమారి

గురుపౌర్ణమి ప్రవచనంతో ఆధ్యాత్మిక చైతన్యం.. భక్తులను అలరించిన బాల సౌజన్యకుమారి

Guru's Wisdom Illuminates Lives

గురువు గొప్పతనాన్ని చాటిన ప్రవచనం

అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో నూకయ్యగారి కళ్యాణ వేదిక వద్ద నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, నంది అవార్డు గ్రహీత శ్రీమతి ఏ. బాల సౌజన్యకుమారి గురుపౌర్ణమి విశిష్టత, గురువు మహిమపై ప్రసంగించారు. ప్రతి మనిషి జీవితంలో గురువు దేవుడితో సమానమని, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే మార్గదర్శి గురువేనని చెప్పారు. వ్యాస మహర్షి జన్మదినమే గురుపౌర్ణమిగా జరుపుకుంటామని వివరించారు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి మానవాళికి జీవన మార్గాన్ని చూపిన వ్యాస మహర్షి సేవలను కొనియాడారు.

ఆదిశంకరాచార్యుల బోధనలపై వివరణ

ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం, పంచాయతన పూజ, ధర్మాచరణ ప్రాముఖ్యతను బాల సౌజన్యకుమారి సులభంగా వివరించారు. కనకధార స్తోత్రం ఆవిర్భావం, దాన ధర్మం గొప్పతనం, సనాతన ధర్మ విలువలను ఉదాహరణలతో వివరించి భక్తులను ఆలోచింపజేశారు. సుమారు 350 మంది భక్తులు ప్రవచనం విని “జై శ్రీమన్నారాయణ” నినాదాలతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ, గణేశాచార్యులు వేదమంత్రాల మధ్య చైర్మన్ ఆళ్ళ శ్రీరామచంద్రమూర్తి, గౌరవాధ్యక్షుడు దొడ్డి బాబు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ప్రవచనకర్తను శాలువా, స్వామివారి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.