ఎమ్మెల్సీనా..? ఇంచార్జ్ బాధ్యతలా..?
ఎమ్మెల్సీ పదవుల ఖరారు నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందినట్లు విశ్వసనీయ సమాచారం. రాయలసీమ ప్రాంతం నుంచి బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతున్న వేళ, ఆ జాబితాలో సుగవాసి ప్రసాద్ బాబు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో రాజంపేట టీడీపీ ఇంచార్జ్ మార్పుపై కూడా గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
సుగవాసి ప్రసాద్ బాబుకు అధిష్టానం పిలుపు..!
ఈ పరిణామాల మధ్య సుగవాసి ప్రసాద్ బాబుకు పార్టీ నుంచి ప్రత్యేక పిలుపు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ఫోన్ చేసి పిలిచినట్లు రాజంపేట టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం. అయితే ఈ పిలుపు ఎమ్మెల్సీ పదవి ఖరారు కోసమా? లేక రాజంపేట టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల అప్పగింత కోసమా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.











