ఎమ్మెల్యేపై రాచమల్లు తీవ్ర విమర్శలు.. రాజీనామా చేయాలని డిమాండ్
ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయనే స్వయంగా అంగీకరించినట్టేనని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రజల ముందే బయటపెట్టారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేసే ముందు ఎమ్మెల్యే తన సొంత వ్యవహారాలను పరిశీలించుకోవాలని రాచమల్లు సూచించారు. ప్రజలకు సేవ చేస్తున్న అధికారులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఉద్యోగులపై నెట్టే ప్రయత్నం చేయకుండా పాలకులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

కొండారెడ్డిపై ఆరోపణలు, రాజీనామా చేయాలని డిమాండ్
ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి పేరును ప్రస్తావిస్తూ మార్కెట్ యార్డు వ్యవహారంతో పాటు చౌడూరు ఇసుక అక్రమాల్లో ఆయన ప్రమేయం ఉందని రాచమల్లు ఆరోపించారు. ఈ అంశాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని విమర్శించారు. జార్జి క్లబ్లో జరుగుతున్నట్లు చెబుతున్న పేకాట వ్యవహారంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అధికారులను కాకుండా ప్రభుత్వ వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్నే ప్రశ్నించాలని రాచమల్లు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ మందలింపుల కారణంగానే ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే మానసిక స్థితిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మహేష్ పోసా
ప్రొద్దుటూరు











