మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.
షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)కు చెందిన వ్యక్తి హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను విడిచి మరో మతంలోకి మారితే ఎస్సీ హోదా వెంటనే కోల్పోతాడని గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం మార్చి 24, 2026న ఇచ్చిన తీర్పులో ఎలాంటి స్పష్టమైన తప్పు కనిపించలేదని పేర్కొంది. అందువల్ల రివ్యూ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మౌఖిక వాదనలు వినాలన్న అభ్యర్థనను కూడా కోర్టు అంగీకరించలేదు.
మార్పిడి జరిగిన క్షణమే హోదా కోల్పోతారు
మార్చి 24న ఇచ్చిన కీలక తీర్పులో రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఆర్డర్–1950లోని క్లాజ్–3ను సుప్రీంకోర్టు విశ్లేషించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారికే ఎస్సీ హోదా వర్తిస్తుందని పేర్కొంది. క్రైస్తవ మతం సహా క్లాజ్–3లో లేని ఏ మతంలోకి మారినా పుట్టుకతో వచ్చిన ఎస్సీ హోదా వెంటనే పూర్తిగా రద్దవుతుందని స్పష్టం చేసింది. ఎస్సీ హోదాతో లభించే రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రత్యేక హక్కులు అన్నీ అదే క్షణం నుంచి ముగుస్తాయని కోర్టు తేల్చింది.
ఏపీ హైకోర్టు తీర్పుకు మద్దతు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే ఎస్సీ హోదా పూర్తిగా కోల్పోతాడని హైకోర్టు చెప్పిన అభిప్రాయమే సరైందని పేర్కొంది. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఆర్డర్–1950 చట్టబద్ధంగా అమల్లో ఉందని గుర్తుచేసింది. ఇప్పటివరకు జరిగిన సవరణల్లో సిక్కు మతాన్ని 1956లో, బౌద్ధ మతాన్ని 1990లో చేర్చారని తెలిపింది. అయితే క్రైస్తవ మతాన్ని ఇప్పటివరకు చేర్చలేదని స్పష్టం చేసింది.
తిరిగి పాత మతంలోకి వస్తే షరతులు
తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారినట్లు ఎవరైనా చెబితే ఆటోమేటిక్‌గా ఎస్సీ హోదా తిరిగి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొదట షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తేనని నిరూపించాలి. తిరిగి అసలు మతంలోకి నిజాయితీగా మారినట్లు విశ్వసనీయ ఆధారాలు సమర్పించాలి. అసలు కులానికి చెందిన సభ్యులు, సంబంధిత సమాజం తిరిగి ఆ వ్యక్తిని అంగీకరించినట్లు స్పష్టమైన సాక్ష్యాలు ఉండాలని కోర్టు పేర్కొంది. ఈ మూడు షరతులు నెరవేరిన తర్వాతే హోదా పునరుద్ధరణ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఈ తాజా ఉత్తర్వుతో మార్చి 24న ఇచ్చిన కీలక తీర్పు యథాతథంగా కొనసాగనుంది.
#SupremeCourt #ScheduledCaste #SCStatus #ReligiousConversion #ReviewPetition #Constitution #Reservation #LegalNews #Judiciary #IndiaLaw #APHighCourt #CourtVerdict #SCReservation #BreakingNews #IndiaNews











