రాజీనామాపై బండి కామెంట్స్ .
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ నిర్ణయం బీజేపీ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. “దేశం ముందు… పార్టీ తర్వాత… వ్యక్తిగత ప్రయోజనం చివర” అనే భావజాలాన్నే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చాటిచెప్పిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మోదీ నాయకత్వంలో బాధ్యతకు ప్రాధాన్యం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వరాన్ని వినడం అని బండి సంజయ్ అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం, అవసరమైన సమయంలో బాధ్యత తీసుకోవడం బీజేపీ సంస్కృతిలో భాగమని చెప్పారు. పదవి కంటే బాధ్యత గొప్పదనే విలువలను ధర్మేంద్ర ప్రధాన్ తన నిర్ణయంతో మరోసారి నిరూపించారని వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రయాణాన్ని కూడా బండి సంజయ్ గుర్తు చేశారు. విద్యార్థి ఉద్యమాలతో ప్రజాజీవితాన్ని ప్రారంభించి, దశాబ్దాల పాటు ప్రజాసేవలో కొనసాగారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించి దేశాభివృద్ధికి సేవలందించారని కొనియాడారు. ఆయన సేవలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే బీజేపీ… ఇదే ప్రజాస్వామ్యం
“ఇదే బీజేపీ… ఇదే ప్రజాస్వామ్యం… దేశమే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం” అంటూ బండి సంజయ్ తన సందేశాన్ని ముగించారు. పదవుల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడమే బీజేపీ ప్రత్యేకత అని స్పష్టం చేశారు. బాధ్యతాయుత రాజకీయాలకు ఈ రాజీనామా నిదర్శనమని అభిప్రాయపడ్డారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వివాదం నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు. ఇది వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన అంశం కాదని స్పష్టం చేస్తూ తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. రాజీనామా అనంతరం బీజేపీ నాయకత్వం నుంచి వచ్చిన తొలి ప్రధాన స్పందనల్లో బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
#BandiSanjay #DharmendraPradhan #BJP #NationFirst #NarendraModi #NEET2026 #EducationMinistry #IndiaPolitics #BJPIdeology #PoliticalNews











