Home National_news అప్పుడే వెనక్కి తగ్గుతామన్న సీజేపీ చీఫ్. ఇవాళ మరోసారి కేంద్రంతో చర్చలు

అప్పుడే వెనక్కి తగ్గుతామన్న సీజేపీ చీఫ్. ఇవాళ మరోసారి కేంద్రంతో చర్చలు

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు.
మరెప్పుడూ ప్రశ్నించలేం.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.


నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగిస్తున్న కాక్‌రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చలకు సిద్ధమైంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. మే 3న పరీక్ష రద్దు తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది. ఈ అంశాలపై శనివారం మరోసారి చర్చలు జరగనున్నాయి.

అప్పటి వరకు ఉద్యమం ఆపం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. అదే తమ ప్రధాన డిమాండ్ అని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే తమ పోరాట లక్ష్యమని చెప్పారు. గతంలో ఉద్యమాలు చేసిన చరిత్ర తమకు లేదని, ప్రస్తుత పరిస్థితులు యువత కోసం వీధుల్లోకి రావాల్సిన అవసరం తెచ్చాయని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతిందని, అందుకే దేశవ్యాప్తంగా యువత ఒక్కటవుతోందని అన్నారు.

మౌనం భవిష్యత్‌కు ప్రమాదం

విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకల కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో భయంతో మౌనం పాటిస్తే దేశ భవిష్యత్తు చీకట్లోకి వెళ్లిపోతుందని హెచ్చరించారు. “ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడూ ప్రశ్నించే అవకాశం ఉండదు” అంటూ యువతకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు.

తటస్థ వేదికపైనే చర్చలు

కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమేనని, కానీ మంత్రుల నివాసాలకు వెళ్లబోమని సీజేపీ స్పష్టం చేసింది. జంతర్‌మంతర్ సమీపంలో లేదా తటస్థ వేదికపైనే చర్చలు జరగాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలను నిజాయితీగా పరిష్కరించాలంటే రాజకీయ హంగులు లేకుండా చర్చలు సాగాలని అభిప్రాయపడింది. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడం ద్వారానే ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉందని నిరూపించగలదని పేర్కొంది.

 

#SJP #CockroachJanataParty #DharmendraPradhan #NEET #NEETPaperLeak #StudentProtests #AbhijeetDeepke #JPNadda #JitendraSingh #Education #IndianPolitics #YouthMovement