Home Telangana సింగరేణి కార్మికులకు బీజేపీ భరోసా రేపటి నుంచి కిషన్ రెడ్డి నేతృత్వంలో యాత్ర రెండు...

సింగరేణి కార్మికులకు బీజేపీ భరోసా రేపటి నుంచి కిషన్ రెడ్డి నేతృత్వంలో యాత్ర రెండు రోజుల పర్యటనకు శ్రీకారం

24



సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ రెండు రోజుల సింగరేణి భరోసా యాత్ర చేపట్టనుంది. తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో కార్మికుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రఘునాథరావు తెలిపారు. సింగరేణి భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదనే సందేశాన్ని కార్మికులకు చేరవేయనున్నట్లు చెప్పారు.

కిషన్ రెడ్డి నేతృత్వంలో పర్యటన

జూలై 13, 14 తేదీల్లో జరిగే ఈ యాత్రకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు నాయకత్వం వహించనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఏవీఎన్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన బృందం ముందుగా కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయానికి చేరుకుని కార్మికులతో సమావేశమవుతుంది.

నాలుగు జిల్లాల్లో విస్తృత కార్యక్రమాలు

యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటన కొనసాగుతుంది. మూడు బహిరంగ సభలు, ఐదు బొగ్గు గనుల వద్ద గేట్ మీటింగ్‌లు నిర్వహించి కార్మికులతో నేరుగా మాట్లాడనున్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ తన వైఖరిని వివరించనుంది. ఈ యాత్ర ద్వారా సింగరేణి ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు కార్మికుల్లో విశ్వాసం పెంపొందుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.