మూసాపేట, కోకాపేట వేలం ఫ్లాప్.
వందల కోట్ల ఆదాయంపై ఆశలు ఆవిరి.
రెండు రోజుల్లో వరుసగా రెండూ ఫెయిల్.
ప్రభుత్వ ప్రయత్నానికి ఇన్వెస్టర్ల బ్రేక్.
ప్రభుత్వ భూములను విక్రయించి వందల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతాలుగా భావించే మూసాపేట, కోకాపేట నియోపోలీస్ భూముల వేలానికి కనీస స్పందన కూడా లభించలేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన ఈ-వేలంలో ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. మూసాపేట ట్రక్ యార్డులోని 3.15 ఎకరాలకు ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర నిర్ణయించగా, కోకాపేట నియోపోలీస్‌లోని 4.59 ఎకరాలకు ఎకరాకు రూ.120 కోట్ల ధర ఖరారు చేశారు. భారీ ధరలతో వేలానికి పెట్టిన ఈ భూములపై రియల్టర్లు, పెట్టుబడిదారులు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు ప్రక్రియను రద్దు చేశారు. భూముల విక్రయంతో భారీ ఆదాయం వస్తుందని ఆశించిన ప్రభుత్వానికి బిడ్డర్లు ముఖం చాటేయడం నిరాశ కలిగించింది.
బీఆర్ఎస్ నిరసనలు.. ధరలపై ఇన్వెస్టర్ల వెనుకడుగు
మూసాపేట ట్రక్ యార్డు భూముల విక్రయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టింది. ఇదే సమయంలో వేలం ధరలు కూడా అధికంగా ఉండటంతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భూముల వేలాన్ని సవాల్ చేస్తూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వేలానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. అయినప్పటికీ బిడ్డర్లు ముందుకు రాలేదు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ పక్కన హుడా పార్క్ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్ల వేలం కూడా ఒక్క బిడ్ లేకుండానే ముగిసింది. కేవలం 48 గంటల వ్యవధిలో రెండు వరుస వేలాలు విఫలం కావడం ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ కార్యక్రమానికి కీలక సవాలుగా మారింది.
మార్కెట్ సంకేతమా.. రాజకీయ ప్రభావమా?
ఒకవైపు ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు అడ్డంకులు తొలగించినా, మరోవైపు మార్కెట్ నుంచి స్పందన రాకపోవడం చర్చనీయాంశమైంది. అధిక రిజర్వ్ ధరలు, రాజకీయ నిరసనలు పెట్టుబడిదారుల నిర్ణయాలపై ప్రభావం చూపాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వేలంలో పాల్గొనకపోవడానికి బిడ్డర్లు అధికారికంగా కారణాలు వెల్లడించలేదు. దీంతో ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం సమకూరలేదు. భూముల విలువ ఎంత ఉన్నా.. కొనుగోలుదారుల ఆసక్తి లేకపోతే వేలం విజయవంతం కాదన్న సంకేతాలు ఈ పరిణామాలతో స్పష్టమవుతున్నాయి.
#Telangana #Hyderabad #LandAuction #Moosapet #Kokapet #Neopolis #HMDA #RealEstate #BRS #TelanganaGovernment











