టీసీఎస్ రూ.70 వేల కోట్ల పెట్టుబడి.
264 ఎకరాల్లో అతిపెద్ద క్యాంపస్.
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ 264 ఎకరాల భూమిని దక్కించుకుని, భాగస్వాములతో కలిసి రూ.70 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. గరిష్ఠంగా 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు వినియోగించుకునేలా అధునాతన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అధిక సామర్థ్యం కలిగిన కంప్యూటింగ్ వ్యవస్థల కోసం లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. కస్టమర్ల అవసరాలు, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టును దశలవారీగా నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టీసీఎస్ ప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును రాష్ట్రానికి, దేశానికి చారిత్రాత్మకమైనదిగా సీఎం అభివర్ణించారు. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో ముందుకు వెళ్తోందని తెలిపారు. ఏఐ మోడళ్లకు అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక మౌలిక సదుపాయంగా మారనుందని చెప్పారు.
వేల ఉద్యోగాలు.. గ్రీన్ క్యాంపస్
ఈ భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డేటా సెంటర్‌తో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో క్యాంపస్‌ను నిర్మించనున్నారు. టీసీఎస్ సీఈఓ, ఎండీ కే. కృతివాసన్ ఈ ప్రాజెక్టు తమ ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-టు-ఇంటెలిజెన్స్’ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో అవసరమైన ప్రతిభ, సాంకేతిక వాతావరణం, మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 2026 జనవరిలో దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మధ్య జరిగిన భేటీ కీలక మలుపుగా నిలిచింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం, టీసీఎస్ మధ్య చర్చలు కొనసాగాయి. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా తెలంగాణ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. దీంతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి భారీ ఊతం లభించింది.
#TCS #TCSHyderabad #HyperVault #HyderabadAI #AIDataCenter #HyderabadDataCenter #70000CroreInvestment #TCSInvestment #TelanganaAI #HyderabadAIHub #RevanthReddy #DataCenterIndia #AIInfrastructure #LiquidCooling #GreenDataCenter #TelanganaInvestments #HyderabadTechnology











