Home Telangana పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ టవర్స్!

పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ టవర్స్!

క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లు.. 3 విడతల్లో నిర్మాణాలు.

హైదరాబాద్‌ పరిధిలో నివసిస్తున్న పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇళ్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే స్థానికంగా నివాస సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టామని వివరించారు. క్యూర్‌ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడుతూనే టవర్స్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాలను వేగంగా గుర్తించాలని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

మూడు విడతలకు ముందస్తు ఏర్పాట్లు

ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు మొదటి విడతతో పాటు రెండో, మూడో విడతలకు అవసరమైన భూములను కూడా ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్థలాల లభ్యత, నిర్మాణాలకు అనుకూలత, ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అర్హులకు అన్యాయం జరగకుండా ఎంపికలో పారదర్శకత పాటించాలని సూచించారు.

ఆన్‌లైన్ డ్రా.. యూట్యూబ్‌లో వివరాలు

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌ డ్రా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. డ్రాను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు, యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. తద్వారా తమ పేరు ఎంపిక జాబితాలో ఉందో లేదో లబ్ధిదారులు సులభంగా తెలుసుకోవచ్చు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మూడు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. భూముల గుర్తింపు నుంచి ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక వరకు అన్ని దశలను సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

 

#IndirammaTowers #TelanganaHousing #IndirammaHousingScheme #TelanganaGovernment #PonguletiSrinivasaReddy #HyderabadHousing #AffordableHousing #DoubleBedroomHouses #HousingBeneficiaries #OnlineDraw #Rangareddy #MedchalMalkajgiri #TelanganaNews