అఖిలేశ్‌పై ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు..
ఐదేళ్ల నరకం.. అఖిలేశ్‌కు ఆజంఖాన్ చురక!
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్ మరోసారి తన జైలు జీవితాన్ని గుర్తుచేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ.. అఖిలేశ్ యాదవ్ కనీసం ఆరు నెలలైనా జైలులో ఉంటే అక్కడి పరిస్థితులు, ఖైదీల బాధలు అర్థమయ్యేవని వ్యాఖ్యానించారు. ఐదున్నరేళ్ల పాటు జైలులో గడిపిన తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో రోజులు, రాత్రులు ఎలా గడుస్తాయో బయట ఉన్నవారికి తెలియదని అన్నారు.
కొడుకుతో విడదీసిన వేళ.. ప్రాణాలపై భయం!
జైలు నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో తన కుమారుడు అబ్దుల్లా ఆజంను తన నుంచి వేరు చేశారని ఆజంఖాన్ ఆరోపించారు. ఇద్దరినీ వేర్వేరు వాహనాల్లో తీసుకెళ్తుండటంతో ఎన్కౌంటర్ చేసి చంపేస్తారేమోనని భయపడ్డామని వెల్లడించారు. ఆ సమయంలో తన కుమారుడితో ఇదే చివరి కలయిక కావచ్చని, మళ్లీ కలవకపోతే పరలోకంలో కలుద్దామని చెప్పినట్లు వివరించారు. బీజేపీ ప్రభుత్వం, జైలు అధికారులు, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు తన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయని ఆరోపించారు. ఐదున్నరేళ్ల చీకటి జీవితం తన శరీరం, మనసుపై తీవ్ర ప్రభావం చూపిందని, మాటల్లో పొరపాట్లు ఉంటే క్షమించాలని సభికులను కోరారు.
అఖిలేశ్‌పై నమ్మకం.. మళ్లీ సీఎం అవుతారు!
గత ఐదేళ్లలో పలు కేసుల్లో బెయిల్ లభించినా మరో కేసులో అరెస్టు కావడంతో ఆజంఖాన్ జైలు జీవితం కొనసాగింది. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయగా, అలహాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. గతంలో అఖిలేశ్‌తో తన సంబంధాలపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలపై ఊహాగానాలకు దారితీశాయి. అయితే అఖిలేశ్ పలుమార్లు జైలులో ఆయనను పరామర్శించారు. తాజా కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తూ ఐక్యతను చాటారు. అంతేకాదు, అఖిలేశ్ యాదవ్ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆజంఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు
#AzamKhan #AkhileshYadav #SamajwadiParty #AbdullahAzam #UPPolitics #AzamKhanSpeech #JailExperience #UttarPradesh











