Home National_news యూపీలో కూటమి కుంపట్లు

యూపీలో కూటమి కుంపట్లు


కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల యుద్ధం!
సీట్ల పంపకాలతో ముదిరిన విభేదాలు
బీజేపీకి అస్త్రంగా ఇండియా కూటమి లొల్లి

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027కు ముందే ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ రచ్చకెక్కింది. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఐదుగురు అభ్యర్థుల జాబితా ప్రకటించడం వివాదానికి కారణమైంది. బెహట్ నుంచి ఉమర్ అలీ ఖాన్, సహరన్‌పూర్ నుంచి ఆశు మాలిక్, కైరానా నుంచి నాహిద్ హసన్, అమ్రోహా నుంచి మహబూబ్ అలీ, లలిత్‌పూర్ నుంచి జ్యోతి లోధిలను బరిలోకి దింపింది. వీటిలో బెహట్, సహరన్‌పూర్ స్థానాలపై కాంగ్రెస్ కూడా ఆశలు పెట్టుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సహరన్‌పూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ విజయం సాధించడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ స్థానాలు కోరుతోంది. ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 26 గెలుపు స్థానాలే ఇస్తామనడం అవమానకరమని ఇమ్రాన్ మసూద్ మండిపడ్డారు. సీట్లపై చర్చలు ఒకవైపు సాగుతుంటే, అభ్యర్థుల ప్రకటన మరోవైపు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

గెలుపు ప్రాతిపదికగా సర్దుబాటు!

వివాదంపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ కాంగ్రెస్ సంయమనం పాటించాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని చర్చలు జరపాలని కోరారు. సీట్ల సంఖ్య కంటే గెలుపు అవకాశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ తనకు కావాల్సిన నియోజకవర్గాల జాబితా పంపిస్తే, రెండు పార్టీలు కలిసి అభ్యర్థుల బలాబలాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ సైతం తమ పార్టీ సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం సాధారణమేనని సమర్థించారు. మరో ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ కాంగ్రెస్‌కు సహనం అవసరమని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఆరు గెలిస్తే, ఎస్పీ 63 స్థానాల్లో పోటీ చేసి 37 గెలిచిందని గణాంకాలు వెల్లడించారు. అయితే ఎంపీ అవధేశ్ ప్రసాద్ మాత్రం కూటమిలో విభేదాలున్నాయన్న ప్రచారాన్ని ఖండించారు. అఖిలేశ్ నాయకత్వంలో బీజేపీని ఓడించడమే ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు.

బీజేపీకి రాజకీయ అస్త్రం!

మిత్రపక్షాల మధ్య రగడను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌కు ఐదు స్థానాలా, 26 స్థానాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారని బీజేపీ నేత సుధాంశు త్రివేది ఎద్దేవా చేశారు. ఐదు పేర్లతో అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్‌కు ఎస్పీ తన ప్రాధాన్యత ఏమిటో చెప్పిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరినా తమకు నష్టమేమీ లేదన్నారు. మరో ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ కూటమిని మోసగాళ్ల కూటమిగా అభివర్ణించారు. ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విశ్వాసం కొరవడిందని, ఈ విభేదాలు బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉందని కమలం నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే అఖిలేశ్ మాత్రం బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు చర్చలు పూర్తయ్యేలోగా ఈ విభేదాలు సమసిపోతాయా? లేక మిత్రపక్షాల మధ్య పోరు మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

 

#UPElections2027 #Congress #SamajwadiParty #AkhileshYadav #INDIAAlliance #SeatSharing #ImranMasood #BJP #UttarPradeshPolitics