Home National_news తుమ్మిడిహెట్టికై మ‌హారాష్ట్రను ఒప్పించండి

తుమ్మిడిహెట్టికై మ‌హారాష్ట్రను ఒప్పించండి

ప్రాజెక్టులకు అనుమతులిప్పించాలన్న సీఎం.
ఎల్‌నినో కరవు సాయం ఇవ్వాలని విజ్ఞప్తి .
మోదీ చొరవ కీలకమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి .

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఆదివారం ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరించారు. కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్‌, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని సీఎం వివరించారు. సుప్రీంకోర్టు సానుకూల తీర్పు నేపథ్యంలో అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో సమన్వయానికి విజ్ఞప్తి

ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును +152 మీటర్ల వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని మోదీని రేవంత్‌రెడ్డి కోరారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగు, తాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. మరోవైపు సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) త్వరగా వచ్చేలా సహకరించాలని కోరారు. ఇందుకోసం అవసరమైన సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించినట్లు వివరించారు.

నిధుల కేటాయింపుపై కేంద్రానికి ప్రతిపాదనలు

పూర్తికావస్తున్న ప్రాజెక్టుల కోసం సాస్కీ పథకం కింద అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. అలాగే 2027–28 ఆర్థిక సంవత్సరంలో నాలుగు సాగునీటి పథకాలకు రూ.5,856 కోట్ల కేంద్ర నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భూగర్భ జలాల పెంపు, పరిరక్షణకు మరో రూ.5,000 కోట్ల ప్రత్యేక సాయం కోరినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సమావేశంలో ప్రధాని సానుకూలంగా స్పందించి విజ్ఞప్తులను పరిశీలిస్తామని తెలిపినట్లు ఆయన చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ప్రస్తుతం నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని నిపుణులు సూచించినట్లు వివరించారు. తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లలో నీటిని నిల్వ ఉంచామని, ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు సూచించినట్లు మంత్రి తెలిపారు.

ఎల్‌నినో కరవుపై కేంద్రానికి సీఎం నివేదిక

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు
పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతులు సమర్పించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్‌, సరిపడా ఎరువులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీబీజీ రాంజీ పథకం కింద అదనంగా 50 రోజుల ఉపాధి కల్పించాలని, రాష్ట్ర రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

 

#RevanthReddy #NarendraModi #ThummidihattiProject #TelanganaIrrigation #Maharashtra #ElNinoDrought #DroughtRelief #UttamKumarReddy #PalamuruRangareddy #TelanganaNews