Home Inter National News బ్రిటన్‌ పౌరుడిగా మారిన లలిత్‌ మోదీ

బ్రిటన్‌ పౌరుడిగా మారిన లలిత్‌ మోదీ

ఆక్స్‌ఫర్డ్‌ వేదికగా కొత్త జీవిత అధ్యాయం.
ఇక లండన్ సొంతిల్లుగా అంటూ ప్రకటన .

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వ్యవస్థాపకుడు లలిత్‌ మోదీ బ్రిటన్‌ పౌరసత్వం పొందారు. గత కొన్నేళ్లుగా లండన్‌లో నివసిస్తున్న ఆయన, ఇప్పుడు అధికారికంగా బ్రిటిష్‌ పౌరుడిగా మారిన విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌ 14న ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌లో ప్రసంగించిన సందర్భంగా తన జీవితంలో జరిగిన ఈ ప్రత్యేక పరిణామాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 15న లండన్‌లోని టౌన్‌హాల్‌లో జరిగిన పౌరసత్వ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో బ్రిటిష్‌ పౌరసత్వం స్వీకరించడం తన జీవితంలో మరిచిపోలేని సందర్భమని పేర్కొన్నారు. బ్రిటన్‌ను ఎన్నో ఏళ్లుగా తన నివాసంగా భావిస్తున్నానని, ఆ దేశ పౌరుడిగా మారడం గర్వంగా ఉందని లలిత్‌ మోదీ వెల్లడించారు.

భారత్‌ను వీడి లండన్‌లో నివాసం

ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ 2010 మేలో లలిత్‌ మోదీని సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత ఆయన భారత్‌ను విడిచిపెట్టి లండన్‌లో నివసిస్తున్నారు. ఐపీఎల్‌ వ్యవహారాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో 2015లో ప్రత్యేక కోర్టు ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మరోవైపు, 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించిన ప్రత్యేక ఫెమా కేసులో తనపై విధించిన జరిమానాను ఈ ఏడాది జూలైలో అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ రద్దు చేసింది. తనను పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొనడాన్ని లలిత్‌ మోదీ వ్యతిరేకిస్తున్నారు. తాను ఎలాంటి నేరంలోనూ దోషిగా నిర్ధారణ కాలేదని గతంలో స్పష్టం చేశారు.

బ్రిటన్‌ విలువలపై ప్రశంసలు

బ్రిటన్‌ ప్రజలు, అక్కడి సంస్థలు, సంప్రదాయాలు, విలువలంటే తనకు ఎంతో గౌరవమని లలిత్‌ మోదీ పేర్కొన్నారు. బ్రిటిష్‌ పౌరసత్వం పొందడం ఒక ప్రత్యేక హక్కుతో పాటు బాధ్యత కూడా అని వ్యాఖ్యానించారు. తన జీవిత ప్రయాణంలో వివిధ దేశాల సంస్కృతులు, అనుభవాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఇకపై తాను గర్వంగా సొంత దేశంగా భావిస్తున్న బ్రిటన్‌కు సానుకూలంగా సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్‌ 14న బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 జన్మదినం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు. ‘గాడ్‌ సేవ్‌ ది కింగ్‌’ అంటూ తన సందేశాన్ని ముగించారు. దీంతో ఐపీఎల్‌ వ్యవస్థాపకుడి బ్రిటిష్‌ పౌరసత్వ ప్రకటన క్రికెట్‌, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 

#LalitModi #BritishCitizenship #IPLFounder #IndianPremierLeague #OxfordUnion #London #BCCI #CricketNews #FEMACase