Home Telangana క్రీడా చరిత్రలో సంచలనం

క్రీడా చరిత్రలో సంచలనం

ఖేలో ఇండియా కొత్త అధ్యాయం.
యువ క్రీడాకారులకు భారీ వేదిక.
క్రీడా సంబరాలకు సర్వం సిద్ధం.

తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 రాష్ట్ర క్రీడా చరిత్రలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన లోగో, మస్కట్‌ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పోటీల నిర్వహణకు తెలంగాణను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని క్రీడా ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

రూ.203 కోట్లతో శాశ్వత సదుపాయాలు

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.21 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.203.13 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించిందని మంత్రి తెలిపారు. ఈ నిధులను పోటీల నిర్వహణకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని స్టేడియాల్లో శాశ్వత క్రీడా మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. దీంతో భవిష్యత్తులో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సాధన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈసారి మొత్తం 27 క్రీడాంశాల్లో పోటీలు జరగనుండగా, తెలంగాణ సంప్రదాయ క్రీడ కర్రసామును కూడా చేర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా క్రీడాకారులు, సుమారు 1,200 మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది పాల్గొననున్నారు. హైదరాబాద్‌తో పాటు హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మత్తుకు దూరంగా.. మైదానాల వైపు యువత

యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వాకిటి శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు “మత్తు వదలండి.. మైదానాలు చేరండి” అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన నశా ముక్త్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఖేలో ఇండియా పోటీల ద్వారా తెలంగాణ క్రీడా ప్రతిభను జాతీయ స్థాయిలో చాటడంతో పాటు, రాష్ట్రాన్ని క్రీడారంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

 

#KheloIndiaYouthGames2026 #KheloIndia #TelanganaSports #RevanthReddy #MansukhMandaviya #VakitiSrihari #SportsInfrastructure #YouthAthletes #KarraSamu #Hyderabad