12వ తరగతి వరకు కొత్త విద్యా విధానం.
విద్యార్థుల భవిష్యత్తే సంస్కరణల లక్ష్యం.
తెలంగాణ విద్యారంగంలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంగా నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు విద్యా వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానం అమల్లోకి తీసుకురావాలని సూచించారు. పదో తరగతి తర్వాత సగటున 40 శాతం మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని, వీరిలో బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలే అధికంగా ఉంటున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 12వ తరగతి వరకు చదువు కొనసాగించే విధానం ద్వారా డ్రాపౌట్లను తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. కేంద్రీయ, నవోదయ, కస్తూర్బా విద్యాలయాల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయని, దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉందని గుర్తుచేశారు. జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని భరోసా ఇచ్చారు.
పాఠశాలలకు పూర్తిస్థాయి మౌలిక వసతులు
సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఇకపై అద్దె భవనాల్లో కొనసాగకూడదని సీఎం స్పష్టం చేశారు. శాశ్వత భవనాల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు విడుదల చేస్తామని తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు, నిరంతర నీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ల్యాండ్‌స్కేపింగ్, ఇంటీరియర్, డిజిటల్ పరికరాలు, క్రీడా సామగ్రి, వంటగది పరికరాల కొనుగోలుకు నాణ్యమైన సంస్థలను ఎంపిక చేయాలని, నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న పాఠశాలల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఇంకా నిర్మించాల్సిన చోట పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఉద్యోగాలకు దారిచూపే విద్య.. నియామకాలకు వేగం
ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ఏటీసీ) మార్చిన తర్వాత విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని, శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు లభించాయని సీఎం తెలిపారు. ఇదే తరహాలో పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణకు అవసరమైన నిధుల విడుదల వేగవంతం చేయాలని ఆదేశించారు. శాఖాపరమైన సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ల నియామకాలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నియామకాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వైస్ ఛాన్సలర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, వివిధ విద్యాశాఖల ఉన్నతాధికారులు, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.
#TelanganaEducation #RevanthReddy #NewEducationPolicy #EducationReforms #Class12Education #StudentDropouts #SchoolEducation #YoungIndiaSchools #ResidentialSchools #ITITraining #PolytechnicColleges #UniversityRecruitments











