Home Telangana ₹1,500 బస్తా.. ఇప్పుడు ₹2,500!

₹1,500 బస్తా.. ఇప్పుడు ₹2,500!

ధాన్యం పండించే నేలపై బియ్యం మంటలా..!?
ధరల పెరుగుదలపై ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.
సన్నబియ్యం ధరలపై సర్కార్‌ను నిలదీసిన రాములమ్మ .

ధాన్యం పండించడంలో ముందున్న తెలంగాణలోనే సామాన్యులు బియ్యం కొనలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకప్పుడు రూ.1,500కు లభించిన 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు రూ.2,500కు చేరిందని, కిలో సన్నబియ్యం ధర రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతున్నా నియంత్రణ చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. మార్కెట్లో విక్రయిస్తున్న పాత సన్నబియ్యం గత వానాకాలం పంటతో పాటు అంతకుముందు సీజన్‌కు చెందినదని, అప్పట్లో అవసరానికి మించి దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉంటే వచ్చే ఏడాది యాసంగి పంటపై, జూన్‌ సమయంలో కనిపించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయాన్ని ప్రస్తావించారు.

నిల్వల మాయనా.. కృత్రిమ కొరతనా?

పాత బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ ధరలు ఎందుకు తగ్గడం లేదని విజయశాంతి నిలదీశారు. వ్యాపారులు అక్రమ నిల్వలు చేయడం, బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం ద్వారా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. తనిఖీలకు మంత్రి ఆదేశించినా క్షేత్రస్థాయిలో అక్రమాలు ఆగడం లేదని, అధికారుల నిర్లక్ష్యం లేదా కుమ్మక్కుపై విచారణ జరపాలని కోరారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యంలో నకిలీ కార్డులు, మరణించిన వారి పేర్లు, అనర్హుల నమోదు, అక్రమ మళ్లింపులపై కూడా సమగ్ర పరిశీలన అవసరమన్నారు.

బియ్యం నిల్వల లెక్కల్లో పారదర్శకత ఏది?

తెలంగాణకు ఏడాదికి 28.56 లక్షల టన్నుల బియ్యం అవసరం కాగా, అక్టోబర్‌ 16 నాటికి 9.64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని, మరో 18.39 లక్షల టన్నులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారని విజయశాంతి పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లుల నుంచి గోదాములు, రేషన్‌ దుకాణాలకు చేరేవరకు ప్రతి గింజకు లెక్క ఉండాలని డిమాండ్‌ చేశారు. ఈ గణాంకాల వాస్తవికతను ప్రభుత్వం నిర్ధారించాలని, మిల్లర్లు, వ్యాపారులు, అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కింది స్థాయి తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని స్పష్టం చేశారు.

 

#Vijayashanti #Telangana #RicePriceHike #RicePrices #FineRice #TelanganaGovernment #RiceHoarding #BlackMarketing #RationRice #TelanganaPolitics #PaddyFarmers