సాయిరెడ్డి పార్టీ ప్రకటనపై కేఏ పాల్ విమర్శలు.
విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ముందుగా విజయసాయిరెడ్డిలో పరివర్తన రావాలని, ఆ తర్వాతే రాజకీయ మార్పుల గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. విజయసాయిపై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ, సుమారు రూ.3 లక్షల కోట్ల సంపద కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనకు సంబంధించిన భూముల వ్యవహారాలపై సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానన్న మాటకు కట్టుబడి ఉండాలని, జగన్ వద్దకు వెళ్లి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమైతే సంపాదించిన ఆస్తులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యతకు పిలుపు
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వెనుక జగన్ ఓట్లను చీల్చే వ్యూహం ఉందని కేఏ పాల్ ఆరోపించారు. ఆయన బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావిస్తూ, ఇప్పుడు మరో రాజకీయ ప్రయోగం జరుగుతోందని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులకే అధిక రాజకీయ అవకాశాలు దక్కుతున్నాయని, జనాభాలో గణనీయమైన వాటా ఉన్న బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ప్రశ్నించారు. కుల కుటుంబ రాజకీయాలు, అవినీతి, రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, ముస్లిం వర్గాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కుల రాజకీయ పార్టీలకు స్వస్తి పలికి బహుజన ఐక్యతతో ముందుకు రావాలని కోరుతూ తన వీడియోను అందరికీ షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.











