సుప్రీంకోర్టులో కేసు గట్టిగా వాదించండి.
అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం!
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు న్యాయపోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌తో వివాదం ఉన్న ప్రతి అంశంపై పూర్తి ఆధారాలతో సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. ఈ నెల 18 తర్వాత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో ప్రత్యేకంగా చర్చించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో నిర్వహించిన నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా అన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
డిండి, అచ్చంపేట పనులకు వేగం..
డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఏదుల నుంచి ఈ రెండు పథకాలకు నీటిని అందించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి తరలింపునకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, ఎక్కడ సొరంగాలు నిర్మించాలి, ఎక్కడ కాలువలు తవ్వాలనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైన సాంకేతిక వివరాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి, దానికి అనుగుణంగా పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
కాళేశ్వరం పనుల్లో తొందరపాటు వద్దు..
కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రేవంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే పూర్తిస్థాయిలో తరలించలేని పరిస్థితులున్నాయని, అలాంటప్పుడు అదనపు టీఎంసీ పనులపై బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, ఆ తర్వాత భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అనుమతులన్నీ పొందిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర డీపీఆర్ సిద్ధం చేసి, చట్టపరమైన, సాంకేతిక అంశాలను పరిశీలించిన అనంతరం ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
#RevanthReddy #KrishnaWaterDispute #TelanganaWaterShare #SupremeCourt #TelanganaAndhraPradesh #DindiLiftIrrigation #AchampetLiftIrrigation #KaleshwaramProject #UttamKumarReddy #TelanganaIrrigation #WaterAllocation #TelanganaNews











