Home AP టెక్నాలజీకి ఊతం.. పరిశ్రమలకు బాసట

టెక్నాలజీకి ఊతం.. పరిశ్రమలకు బాసట

30 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం!


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటీ, పరిశ్రమలు, రెవెన్యూ, హోంశాఖలకు చెందిన 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 2026–31 కాలానికి ఏపీ ఏవీజీసీ–ఎక్స్‌ఆర్‌ పాలసీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ రంగాల అభివృద్ధి ఈ విధానం లక్ష్యం. 2026–2036 కాలానికి రోబోటిక్స్‌, ఫిజికల్‌ ఏఐ పాలసీకి ఆమోదం తెలిపింది. ఏపీ సెమీకండక్టర్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ పాలసీ 4.0లో ముసాయిదా సవరణలకు కూడా అంగీకరించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో డేటా సెంటర్లకు అవసరమైన మాడ్యులర్‌ పరికరాల తయారీ యూనిట్‌ కోసం ఎపాక్‌ డేటా సెంటర్‌ సొల్యూషన్స్‌కు రూ.570.20 కోట్ల పెట్టుబడి, 2,565 ఉద్యోగాల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

భారీ పెట్టుబడులు.. వేలాది ఉద్యోగాలు

తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఐరన్‌ ఫాస్ఫేట్‌, లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ తయారీ సముదాయం ఏర్పాటుకు కార్బన్‌ కాస్మో అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ రూ.4,000.20 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల 700 మందికి ఉపాధి లభించనుంది. తిరుపతిలో డిక్సన్‌ టెక్నాలజీస్‌కు రూ.700 కోట్ల పెట్టుబడితో 2,300 ఉద్యోగాల కల్పనకు భూ కేటాయింపునకు ఆమోదం లభించింది. విశాఖ జిల్లాలో 512 మెగావాట్ల గ్రీన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఏఎం ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌ ప్రతిపాదించిన రూ.31,387 కోట్ల భారీ పెట్టుబడికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. నవంబర్‌ 6న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలకూ మంత్రివర్గం అనుమతి తెలిపింది. పశ్చిమగోదావరిలో రావళి స్పిన్నర్స్‌కు రూ.236.92 కోట్ల పెట్టుబడిపై ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాథీ గ్రీన్‌ ఎనర్జీ, న్యూల్యాండ్‌ ల్యాబొరేటరీస్‌కు ఎర్లీ బర్డ్‌ ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. నక్కపల్లిలోని ఏపీ బల్క్‌ డ్రగ్‌ పార్కులో హెటెరో గ్రూప్‌కు భూమి, అన్నమయ్య జిల్లాలో ఫుట్‌వేర్‌ విడిభాగాల పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్‌ జిల్లా జయంతిపురంలో 30 ఎకరాలను ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ సిఫారసు చేసే మహిళా పారిశ్రామికవేత్తలకు రాయితీ ధరలపై కేటాయించేలా ‘ఎఫ్‌ఎల్‌ఓ మహిళా పారిశ్రామిక పార్కు’ ఏర్పాటుకు నిర్ణయించింది.

మహిళలకు ప్రోత్సాహం.. ఇంధన రంగంలో కొత్త అడుగులు

హోంశాఖ పరిధిలో మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్డు భద్రత డైరెక్టరేట్‌ ఏర్పాటు చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు, శిల్పి విభాగంలో ప్రత్యేక పోస్టుల ఏర్పాటుకు దేవాదాయ శాఖ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భవిష్యత్తులో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్‌ అణు సాంకేతికతను పరిశీలించేందుకు ఏపీజెన్‌కోకు అనుమతి ఇచ్చింది. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ–2024 కింద ఎన్టీఆర్‌, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేయనున్న భారీ స్థాయి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌ కోసం దాదాపు 25 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించింది. అన్నమయ్య జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు భూ కేటాయింపునకు కూడా అంగీకరించింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో ఏఐ, సెమీకండక్టర్లు, రోబోటిక్స్‌, గ్రీన్‌ ఎనర్జీ, తయారీ రంగాలకు పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఉద్యోగావకాశాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

 

#APCabinet #AndhraPradesh #ChandrababuNaidu #CabinetDecisions #IndustrialInvestments #AIDataCentre #AIPolicy #Robotics #SemiconductorPolicy #AVGCXRPolicy #DixonTechnologies #RelianceIndustries #GreenEnergy #JobCreation #WomenEntrepreneurs #APIndustrialGrowth