Home Sports_News ప్రపంచకప్‌కు ఇషాన్ టీమిండియాకు ఆల్‌రౌండర్ అస్త్రం!

ప్రపంచకప్‌కు ఇషాన్ టీమిండియాకు ఆల్‌రౌండర్ అస్త్రం!

2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనుక సెలెక్టర్ల ప్రత్యేక ఆలోచన ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఓపెనర్‌గా విధ్వంసం సృష్టించగలడు.. మిడిలార్డర్‌లోనూ మెరుపులు మెరిపించగలడు.. వికెట్ల వెనుక బాధ్యతలు కూడా సమర్థంగా నిర్వర్తించగలడు.. ఇలా మూడు కీలక అవసరాలకు ఒకే సమాధానంగా ఇషాన్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఘనత అతని సొంతం. ఆఫ్ఘనిస్థాన్‌పై నాలుగో స్థానంలో 79 బంతుల్లో 125 పరుగులు చేయడం మిడిలార్డర్‌లోనూ తన సత్తా చాటింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం తర్వాత టీ20ల్లోనూ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లో 61 పరుగులు బాది తన ఫామ్‌ను చాటాడు. మరోవైపు రోహిత్ శర్మ తిరిగి అద్భుతంగా రాణిస్తుండటంతో యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతులకు అవకాశాలు కష్టమవుతున్నాయి. ప్రపంచకప్ జట్టులో కేవలం 15 మందికే చోటుండటంతో ప్రతి ఎంపిక కీలకం. ఈ నేపథ్యంలో ఇషాన్ లాంటి బహుముఖ ఆటగాడు జట్టుకు అదనపు బలం. అయితే వన్డేల్లో మరిన్ని మ్యాచ్‌లు ఆడితేనే అతడి సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించే అవకాశం ఉంటుంది. సెలెక్టర్లు అతడికి ఎన్ని అవకాశాలు ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరం!

 

#IshanKishan #WorldCup2027 #TeamIndia #ODIWorldCup #IndianCricket #IndiaVsNewZealand #RohitSharma #YashasviJaiswal #BCCI #CricketNews