డిసెంబర్ 11 నుంచి 22 వరకు క్రీడా సంబరం.
ఏర్పాట్లలో నాణ్యతే కీలకమన్న సీఎం రేవంత్ .
తెలంగాణలో ఖేలో ఇండియా పోటీల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 11న అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించాలని, ఎల్బీ స్టేడియంలో ప్రారంభ వేడుకలు, గచ్చిబౌలిలో ముగింపు వేడుకలు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరమంతా క్రీడా స్ఫూర్తి కనిపించేలా అలంకరణలు, ఇతర ఏర్పాట్లు ఉండాలన్నారు. పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి విభాగానికి ప్రత్యేక ఇన్చార్జిని నియమించి బాధ్యతలు అప్పగించాలని, జిల్లాలవారీగా మంత్రులను పర్యవేక్షణ బాధ్యులుగా నియమించాలని సూచించారు.
జిల్లాలవారీగా మంత్రులకు బాధ్యతలు
పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సీఎం సూచించారు. మహబూబ్‌నగర్‌కు జూపల్లి కృష్ణారావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌కు అడ్లూరి లక్ష్మణ్‌ను బాధ్యులుగా నియమించాలని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌కు సుదర్శన్‌రెడ్డికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. క్రీడాకారులు, ఆహ్వానితులకు నాణ్యమైన ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు అన్ని ఏర్పాట్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
క్రీడాకారుల తయారీకి ప్రత్యేక ప్రణాళిక
ఖేలో ఇండియా పోటీల నిర్వహణతో పాటు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు దేశంలోనే అత్యుత్తమ కోచ్‌లను నియమించాలని ఆదేశించారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఖేలో ఇండియా పోటీలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు తెలంగాణను క్రీడా రంగంలో ముందంజలో నిలిపేలా అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.
#KheloIndia #KheloIndia2026 #Telangana #RevanthReddy #Hyderabad #SportsEvents #LBStadium #Gachibowli #SportsDevelopment











