Home Naadesam_Special రోజుకో గుడ్డు చాలదా? కోడినే చంపేస్తారా!

రోజుకో గుడ్డు చాలదా? కోడినే చంపేస్తారా!

ఆశకు అంతులేదా?
బంగారు గుడ్లు పెట్టే యూపీఐ
కేంద్రానికి అన్నామలై చురకలు

రోజూ బంగారు గుడ్డు పెట్టే కోడి ఉంటే.. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఒకేసారి వంద గుడ్లు కావాలనే అత్యాశతో కోడినే కోసేస్తే.. చివరకు గుడ్డూ ఉండదు, కోడీ ఉండదు! యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనపై మాజీ ఐపీఎస్‌ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై చేసిన వ్యాఖ్యల సారాంశం ఇదే. కర్ణాటకలోని బీజేపీకి బలమైన పట్టున్న ఉడుపిలో రిటైలర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన, యూపీఐ అనేది రోజూ బంగారు గుడ్డు పెట్టే కోడి లాంటిదని అభివర్ణించారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రజలకు అలవాటు చేసిన తర్వాత, వాటిపై అదనపు భారం వేస్తే ఆ వ్యవస్థకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. చిన్న వ్యాపారుల జీవనాధారం కంటే ఆదాయ సేకరణకే ప్రాధాన్యం ఇస్తే మొదటికే మోసం వస్తుందని చురకలంటించారు.

రూ.15 వేల కోట్ల కోసం ఇంత అత్యాశా?

యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదించిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) ఛార్జీలతో సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశమున్న అంశాన్ని అన్నామలై ప్రస్తావించారు. సుమారు రూ.50 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగిన కేంద్రానికి ఈ మొత్తం అంత పెద్దదేమీ కాదని వ్యాఖ్యానించారు. యూపీఐ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ ఖర్చును పెట్టుబడిగా ఎందుకు చూడకూడదని ప్రశ్నించారు. చిన్న వ్యాపారులపై భారం వేయకుండా చెల్లింపుల వ్యవస్థకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని ఆర్థిక, వాణిజ్య శాఖలను కోరారు. అయితే, కేంద్రం మాత్రం వినియోగదారులపై భారం పడదని, దాదాపు 96 శాతం వ్యాపార లావాదేవీలకు ప్రభావం ఉండదని చెబుతోంది. చిన్న వ్యాపారులకు వర్తించే మినహాయింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు ప్రశ్న.. డిజిటల్‌ చెల్లింపుల విస్తరణకు ఖర్చు ఎవరు భరించాలన్నదే!

చిన్న వ్యాపారులే ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

స్థానిక వ్యాపారాలు ఉద్యోగాలు కల్పిస్తాయని, సమాజంలో డబ్బు చలామణిని పెంచుతాయని అన్నామలై పేర్కొన్నారు. పెద్ద సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తే చిన్న వ్యాపారులు నష్టపోతారని హెచ్చరించారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’తో పాటు దేశీయ అవసరాల కోసం ఉత్పత్తిని పెంచే ‘మేక్‌ ఫర్‌ ఇండియా’కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పార్లమెంట్‌లో వ్యాపారుల సమస్యలను లేవనెత్తాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. కర్ణాటక అభివృద్ధి బెంగళూరుకే పరిమితం కాకూడదని, ఉచిత పథకాల ప్రచారం కంటే అభివృద్ధి పనులే రాజకీయ పోటీకి కొలమానాలు కావాలని వ్యాఖ్యానించారు. గతంలో కర్ణాటకలో పోలీసు అధికారిగా పనిచేసి ‘సింగం’గా గుర్తింపు పొందిన అన్నామలై, ఇప్పుడు అదే ప్రాంతంలో కేంద్ర విధానంపై ప్రశ్నలు సంధించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. బంగారు గుడ్డు పెట్టే కోడిని కాపాడాలన్న ఆయన హెచ్చరిక.. చిన్న వ్యాపారుల ప్రయోజనాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చకు తెరతీసింది.

 

#Annamalai #UPICharges #UPITransactionFees #DigitalPayments #MerchantDiscountRate #MDRCharges #SmallBusinesses #RetailTraders #BJP #IndianEconomy #MakeInIndia #UPIPolicy