Home AP తుపాను ముప్పు విద్యుత్ శాఖ అప్రమత్తం!

తుపాను ముప్పు విద్యుత్ శాఖ అప్రమత్తం!

25 వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం
అత్యవసర సేవలకు 1912 హెల్ప్‌లైన్‌
విద్యుత్ వ్యవస్థపై మంత్రుల ప్రత్యేక దృష్టి

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అతి తీవ్ర తుపాను ముప్పుతో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అక్టోబర్ 25న ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, హోంమంత్రి వంగలపూడి అనిత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల విద్యుత్‌ వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ స్తంభాలు, ఇతర పరికరాలు దెబ్బతిన్నా సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ప్రమాదకర హోర్డింగులు, బ్యానర్లను తొలగించి ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించాలని సూచించారు.

25 వేల స్తంభాలు రెడీ

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర మరమ్మతుల కోసం 25 వేల విద్యుత్‌ స్తంభాలతో పాటు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు మంత్రులకు తెలిపారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ అక్టోబర్ 26 నుంచి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు సున్నిత ప్రాంతాల్లో విద్యుత్‌ సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కీలక విద్యుత్‌ కేంద్రాలు, హైటెన్షన్‌ సబ్‌స్టేషన్లు, ప్రసార లైన్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అత్యవసర విధుల్లో ఉన్న ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందికి సెలవులు పరిమితం చేయాలని స్పష్టం చేశారు.

ప్రజలకు హెచ్చరిక

వాతావరణ శాఖ అంచనా ప్రకారం తుపాను అక్టోబర్ 26న తుపానుగా, 27న తీవ్ర తుపానుగా, 28న అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఐదు రోజులపాటు బీచ్‌లకు వెళ్లడం, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు దిగడం మానుకోవాలని సూచించారు. అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 1912 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అధికారిక హెచ్చరికలను పాటించాలని, వదంతులను నమ్మవద్దని అధికారులు కోరారు.

 

#AndhraPradeshCyclone #CycloneAlert #PowerDepartment #GotipatiRaviKumar #VangalapudiAnitha #ElectricitySupply #1912Helpline #PowerRestoration #CyclonePreparedness #NDRF #SDRF #CoastalAndhra #APNews