Home AP జిలెటిన్‌ పేలుడు ఏడుగురి దుర్మరణం

జిలెటిన్‌ పేలుడు ఏడుగురి దుర్మరణం

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.
రహదారి పనుల్లో ఒక్కసారిగా పేలుడు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రహదారి నిర్మాణ పనుల వద్ద జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని పీచుమామిడి సమీపంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్‌ స్టిక్స్‌తో కూడిన ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. యంత్రంలో డీజిల్‌ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఐదుగురు కార్మికులు, వాహన డ్రైవర్‌, పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత ఈ ఘటనలో మృతిచెందారు. ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

ధ్వంసమైన వాహనాలు.. విచారణకు ఆదేశాలు

పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బొలెరో వాహనం గుర్తుపట్టలేనంతగా ధ్వంసమవగా, టిప్పర్‌ మంటల్లో కాలిపోయింది. పేలుడు శబ్దంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణాలను గుర్తించేందుకు ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు నేతల సంతాపం

ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక పరిహారం అందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయం అందించాలని కోరారు

 

#AlluriSitaramaRajuDistrict #GelatinExplosion #AndhraPradeshNews #SevenKilled #Pinakota #AnantagiriMandal #RoadConstructionAccident #ExplosionNews #PawanKalyan #ChandrababuNaidu #BreakingNews #APNews