ముగిసిన విజయ్ దాంపత్య వివాదం
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం, టీవీకే అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ దాంపత్య వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీతా సోర్నలింగం దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో కేసు ముగిసింది. సంగీతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ న్యాయస్థానం విచారణకు హాజరై పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కోర్టు కేసును అధికారికంగా ముగించింది.
నెలలుగా సాగిన న్యాయ ప్రక్రియ
ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో సంగీతా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. దాంపత్య జీవితంలో సర్దుబాటు కుదరడం లేదని పేర్కొంటూ వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరారు. శాశ్వత భరణం ఇవ్వాలని, చెన్నైలోని నీలాంకరైలో ఉన్న కుటుంబ నివాసంలో కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని కూడా అభ్యర్థించారు. జూన్ 15న జరిగిన విచారణలోనే పిటిషన్ ఉపసంహరించుకునే ఉద్దేశాన్ని కోర్టుకు తెలియజేయడంతో కేసును ఆగస్టు 7కు వాయిదా వేశారు.
గత విచారణల్లో గైర్హాజరు
గత నెల జరిగిన విచారణకు విజయ్, సంగీతా ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అంతకుముందు కూడా వారి తరఫు న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరై వ్యక్తిగత హాజరుకు ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. చివరకు సంగీతా స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై పిటిషన్ ఉపసంహరణకు గల కారణాలను వివరించడంతో ఈ వ్యవహారానికి తెరపడింది.
మూడు దశాబ్దాల బంధం
విజయ్, సంగీతా దాదాపు మూడు దశాబ్దాలుగా కలిసి ఉన్నారు. 1999 ఆగస్టు 25న చెన్నైలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2023 నుంచి సంగీతా విజయ్‌కు సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో దాంపత్య జీవితంపై ఊహాగానాలు మొదలయ్యాయి. 2025లో టీవీకే ప్రధాన రాజకీయ కార్యక్రమాలకు కూడా ఆమె హాజరుకాకపోవడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఇప్పుడు విడాకుల పిటిషన్ ఉపసంహరణతో ఆ ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లైంది.
#Vijay #JosephVijay #SangeethaSornalingam #VijaySangeetha #VijayDivorce #DivorceCase #TVKVijay #TamilNaduPolitics #VijayNews #Sangeetha #ChennaiFamilyCourt #MaritalDispute #VijayLatestNews











