రామప్ప దేవాలయానికి సమీపంలో ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములపై ఆధిపత్యం తర్వాత ఇప్పుడు భూమి లోపల ఉన్న ఖనిజ సంపద కోసం చారిత్రక వారసత్వ కట్టడాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రామప్ప ఆలయం తెలంగాణ శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోందని, 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ కట్టడం పరిరక్షణ అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. రామప్పకు సమీపంలో గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల చారిత్రక ప్రదేశం భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు.
తవ్వకాలు.. బ్లాస్టింగ్స్పై ఆందోళన
ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ గనిలో భారీ స్థాయిలో లోతైన తవ్వకాలు, బ్లాస్టింగ్స్ జరిగితే వాటి ప్రభావం రామప్ప ఆలయం, రామప్ప చెరువుపై పడే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. గనుల ప్రభావంతో భూగర్భ జలాల ప్రవాహం, చెరువు పరిసర ప్రాంతాలపై మార్పులు రావచ్చన్న ఆందోళనలు ఇప్పటికే వ్యక్తమయ్యాయి. రామప్ప ఆలయ నిర్మాణం సున్నితమైన పునాదిపై ఉండటంతో నిరంతర ప్రకంపనలు దీర్ఘకాలంలో ప్రభావం చూపవచ్చని వారసత్వ పరిరక్షణ వర్గాలు కూడా హెచ్చరించాయి. ప్రతిపాదిత గని ప్రాంతం రామప్ప ఆలయం, చెరువుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టే అవకాశం ఉందన్న సమాచారం కూడా ఆందోళనకు కారణమైంది.
ప్రతిపాదన వెనక్కి తీసుకోండి
వారసత్వ సంపదకు నష్టం కలిగించే ఏ చర్యనైనా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రామప్ప దేవాలయానికి హాని కలిగించే అవకాశమున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
#TelanganaSIR #SIR2026 #Form6 #Form6A #Form7 #Form8 #SudharshanReddy #TelanganaCEO #VoterList #VoterDeletion #VoterVerification #ElectoralRoll #TelanganaElections #ElectionCommission #Form7Controversy











