Home National_news ఎస్‌ఐఆర్‌ మూడో దశపై లవాసా ప్రశ్నలు

ఎస్‌ఐఆర్‌ మూడో దశపై లవాసా ప్రశ్నలు

భిన్నాభిప్రాయాలపై స్పష్టత కోరిన మాజీ ఈసీ.


మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా.. ఎన్నికల సంఘంలో నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా నిర్ణయాలు ఎలా ముందుకు వెళ్లాయో ఈసీ స్పష్టం చేయాలని కోరారు. ఆ అభిప్రాయాలు అధికారిక డిసెంట్‌నా? లేక అంతర్గత పరిశీలనలేనా? తేదీలు, వివరాలతో పాయింట్‌ వారీగా వెల్లడించాలని సూచించారు. భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో సాధారణమేనని ఈసీ చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై పారదర్శకత అవసరమని లవాసా పేర్కొన్నారు. 2019లో తాను కూడా కొన్ని ఈసీ నిర్ణయాలపై అధికారికంగా విభేదాలు నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఫారమ్‌ 6 నుంచి ఎస్‌ఐఆర్‌ వరకు అభ్యంతరాలు

కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారమ్‌ 6లో మార్పులు చట్టబద్ధ ప్రక్రియ లేకుండా చేయలేరని లవాసా స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ మూడో దశలో ఓటర్ల మ్యాపింగ్‌, లాజికల్‌ డిస్క్రెపెన్సీలపై స్పష్టత లేదని పేర్కొంటూ ఈ దశను నిలిపివేయాలని కోరారు. రెండో దశ అనంతరం పశ్చిమ బెంగాల్‌లో దాఖలైన అప్పీళ్లలో 93 శాతం ఓటర్లకు అనుకూలంగా పరిష్కారమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇది తొలగింపుల ప్రక్రియపై ప్రశ్నలు రేకెత్తిస్తోందని అభిప్రాయపడ్డారు. అర్హులైన ఓటర్ల పేర్లను వేగంగా పునరుద్ధరించే వ్యవస్థ ఉండాలని సూచించారు.

ఈసీది ఏకగ్రీవ నిర్ణయాలేనన్న వాదన

ఇక గత ఏడాది తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయని ఎన్నికల సంఘం చెబుతోంది. లిఖితపూర్వక నోట్లు, సూచనలు, సాంకేతిక అభిప్రాయాలు సాధారణ సంస్థాగత చర్చల్లో భాగమని స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్‌ లక్ష్యం చనిపోయిన, డూప్లికేట్‌ వంటి అనర్హ ఓటర్ల పేర్లను గుర్తించి ఓటర్ల జాబితాను సరిదిద్దడమేనని ఈసీ ప్రక్రియలో పేర్కొంటోంది.

 

#AshokLavasa #SIR2026 #SpecialIntensiveRevision #ElectionCommission #ECI #ECIDissent #Form6 #VoterList #WestBengalSIR #ERONet #VoterAppeals #ElectoralRoll #VoterRegistration #SIRControversy #ElectionNews