Home AP రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలి

రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలి

ఫైల్‌ పెండింగ్‌ అంటే అభివృద్ధి పెండింగ్‌.
సుపరిపాలనతోనే స్వర్ణాంధ్ర సాధ్యం.

శాఖల వారీగా గంటల తరబడి రివ్యూలు చేయడం కాదు.. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టులు తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. అధికారులు ప్రజా సేవకులుగా పనిచేయాలని, ఈగోలకు దూరంగా ఉండాలని సూచించారు. ఓనర్‌షిప్‌ తీసుకోగలిగితేనే లీడర్‌షిప్‌ ఇవ్వగలరని స్పష్టం చేశారు. గత 27 నెలల్లో రాష్ట్రంలో అనేక వ్యవస్థాగత మార్పులు చేశామని, 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్‌లాక్‌ చేశామని తెలిపారు. రియాక్టివ్‌ గవర్నెన్స్‌ నుంచి ప్రో యాక్టివ్‌ గవర్నెన్స్‌ దిశగా వెళ్లాలని చెప్పారు. “ఫైల్‌ పెండింగ్‌ అంటే అభివృద్ధి పెండింగ్‌.. ఫిర్యాదు పెండింగ్‌ అంటే ప్రజలకు న్యాయం పెండింగ్‌” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజన్‌ ఉన్నంత మాత్రాన సరిపోదని, దానిని అమలు చేయాల్సిందేనన్నారు.

జిల్లాలు పోటీ పడాలి.. బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ రావాలి

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం జరిగితే అధికారులు వాస్తవాలతో ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దు.. వాస్తవాలను మాత్రమే చెప్పాలి అని ఆదేశించారు. సమస్యలను దాచిపెడితే అవి మరింత పెద్దవవుతాయని, బహిరంగంగా చర్చిస్తే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. శాఖలు, జిల్లాలు, సెక్రటరీలు, కలెక్టర్లు అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ పడాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో 25 ప్రాధాన్యతా ప్రాజెక్టులు, ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 కీలక అంశాలను గుర్తించి వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాల్లో గ్రోత్‌ ఇంజన్లను గుర్తించి సంపద, ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు. ఏలూరు జిల్లా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని ఉదాహరణగా చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్లను కోరారు. “వన్‌ స్టేట్‌.. వన్‌ విజన్‌.. వన్‌ టీమ్‌.. వన్‌ మిషన్‌.. అదే స్వర్ణాంధ్ర” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

డీఎస్సీపై మహిళా అధికారులకు కితాబు

డీఎస్సీ–2025పై జరుగుతున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, శాప్‌ ఎండీ భరణిలను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్సీలో ఎక్కడా తప్పు జరగలేదని, స్పోర్ట్స్‌ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. ఇదే సమయంలో నీటి భద్రతపై కూడా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఏడాది 54 శాతం లోటు వర్షపాతం నమోదైందని, రిజర్వాయర్లలో గతేడాది 85 శాతం నీటి నిల్వలు ఉంటే ప్రస్తుతం 57 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. తాగునీటి విషయంలో రాజీ పడొద్దని, ప్రతి ఎకరాను సాగులోకి తీసుకురావాలని సూచించారు. నెలవారీ ఆర్థిక నివేదికలతో ప్రగతిని బేరీజు వేస్తున్నామని, ప్రస్తుతం 13.44 శాతం వృద్ధిని 15 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సంక్షోభ సమయంలోనే కలెక్టర్ల నాయకత్వ సామర్థ్యం బయటపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

 

#ChandrababuNaidu #Chandrababu #APCollectors #CollectorsConference #APGovernance #GoodGovernance #ProactiveGovernance #APDevelopment #SwarnaAndhra #APGovernment #DistrictCollectors #DevelopmentProjects #PendingFiles #GovernanceReforms #APGrowth #EconomicGrowth #WaterSecurity #APWaterResources #APDSC #MegaDSC #TameemAnsariya #Bharani #AndhraPradeshPolitics #APPolitics #APNews