ప్రతినిధులకు అత్యుత్తమ సౌకర్యాలు.. ఫేషియల్ రికగ్నిషన్‌తో ప్రవేశం.
ప్రపంచస్థాయి ఆతిథ్యానికి పకడ్బందీ ఏర్పాట్లు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రతినిధులకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా సులభంగా ప్రవేశం కల్పించాలని, మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాలు, ప్రత్యేక ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రత్యేక అనుసంధాన అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. విధుల్లో ఉండే అధికారులు ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమైన అంతర్జాతీయ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించారు.
తెలంగాణ సంస్కృతికి పెద్దపీట.. విద్యార్థులకు ప్రత్యేక అవకాశం
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. సమ్మక్క సారలమ్మ ఆలయంలోని ప్రసిద్ధ తోరణాల నమూనాలను ప్రదర్శనలో ఉపయోగించాలని ఆదేశించారు. సమ్మిట్‌లో నిర్వహించే వైమానిక విన్యాసాలు, ఇతర కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు వీక్షించేలా అవకాశం కల్పించాలన్నారు. దేశ, విదేశాల్లో పేరుపొందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు విద్యా ప్రదర్శనలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ విద్యాసంస్థలతో తెలంగాణ విద్యాసంస్థలకు అనుసంధానం కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమ్మిట్‌కు వచ్చే ప్రతి ప్రతినిధికి తెలంగాణ ఆతిథ్యాన్ని చాటిచెప్పేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఏర్పాట్లలో ఏ అధికారి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని సీఎం హెచ్చరించారు.
#RevanthReddy #InvestTelangana #GlobalSummit #TelanganaGlobalSummit #FacialRecognition #TelanganaInvestments #BhattiVikramarka #UttamKumarReddy #SridharBabu #TelanganaCulture











