ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ అవసరమని చెప్పిన పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని అన్నారు. ఇకపై “జనాభా నియంత్రణ” కాదు… “జనాభా సంరక్షణ” అనే నినాదం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడం ఆందోళనకరమని చెప్పారు. పిల్లలే రాష్ట్రానికి నిజమైన సంపద అని, భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి వారే బలమని స్పష్టం చేశారు.
మారుతున్న సామాజిక పరిస్థితులు
నగరాల్లో జననాల రేటు తగ్గుతూ, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను కనకూడదని భావించే దంపతుల సంఖ్య పెరగడం మంచిది కాదన్నారు. పిల్లల పెంపకంలో తండ్రి కూడా సమాన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇంటి పనులు, పిల్లల సంరక్షణలో పురుషులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఆడపిల్లల విద్యను ప్రోత్సహించామని, ఇప్పుడు వారు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని చెప్పారు. వరకట్నం నుంచి ఎదురు కట్నం వరకు సమాజంలో మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు.
ఆరోగ్యం, నైపుణ్యాలపై దృష్టి
సంజీవిని కార్యక్రమం ద్వారా డిజిటల్ ఆరోగ్య రికార్డులు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. సోషల్ మీడియా ప్రభావంతో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత యోగా, ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు. జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకుంటూ నైపుణ్యాలను పెంచుకోవాలని చెప్పారు. జనాభా తగ్గితే అభివృద్ధి లక్ష్యాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తూ, 2040 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించే శక్తి రాష్ట్రానికి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్టాళ్లను పరిశీలించిన సీఎం, వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Home Uncategorized జనాభా సంరక్షణే భవిష్యత్ బాట.. పిల్లలే రాష్ట్రానికి అసలైన సంపద… స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు










