Home National_news పార్లమెంట్ చరిత్రలో కొత్త రికార్డు

పార్లమెంట్ చరిత్రలో కొత్త రికార్డు

88 రోజులుగా ముగియని సమావేశాలు!
డీలిమిటేషన్ బిల్లుల కోసమేనా జాప్యం?
ప్రత్యేక సమావేశాలపై రాజకీయ ఉత్కంఠ.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా, అధికారికంగా ముగింపు పలకకపోవడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ, రాజ్యసభలను ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, నవంబర్ 9 ఉదయం వరకు ప్రొరోగ్ చేయలేదు. దీంతో గతంలో 2008లో నమోదైన 87 రోజుల రికార్డును అధిగమించి 88 రోజుల సరికొత్త రికార్డు నమోదైంది. సభలను అధికారికంగా ప్రొరోగ్ చేయకపోవడంతో ప్రస్తుత సమావేశాలనే తిరిగి నిర్వహించే అవకాశం ఇంకా సజీవంగా ఉంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా పార్లమెంట్‌ను సమావేశపరిచే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రతిపాదనలో భాగంగా డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ స్థానాలను ప్రస్తుత 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచాలనే అంశం కూడా ఉంది.

ప్రత్యేక సమావేశాలకు రెండు రోజుల నోటీసు

ప్రస్తుత సమావేశాలను కొనసాగిస్తూ ప్రత్యేకంగా లేదా పొడిగింపుగా పార్లమెంట్‌ను సమావేశపరిస్తే కనీసం రెండు రోజుల ముందస్తు నోటీసు సరిపోతుంది. అదే కొత్త సమావేశాలను ప్రారంభించాలంటే కనీసం 14 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుత సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఏప్రిల్ 17న బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక భేటీలో మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మద్దతు పొందలేకపోయింది. దీంతో మరోసారి ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే సమావేశాలను ఎప్పుడైనా తిరిగి నిర్వహించేందుకు వీలుగా ఉంచడమే ప్రభుత్వ ఉద్దేశమా అన్నది ఇంకా స్పష్టత లేదు.

రాజ్యాంగంలో గడువు లేదు.. గతంలోనూ ఉదాహరణలు..

లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత ఎన్ని రోజుల్లో ప్రొరోగ్ చేయాలనే విషయంలో రాజ్యాంగం నిర్దిష్ట గడువును విధించలేదు. ఎక్కువ రోజులు ప్రొరోగ్ చేయకపోవడం మాత్రమే రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించలేమని పార్లమెంటరీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గతంలో 2008లో 87 రోజులు, 1987లో 76 రోజులు, 1989లో 54 రోజులు, 2006, 2013లో 49 రోజుల పాటు సమావేశాలు ప్రొరోగ్ కాలేదు. 2008లో జూలై 21, 22 తేదీల్లో అప్పటి యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు లోక్‌సభ సమావేశమైంది. అనంతరం అక్టోబర్ 17న తిరిగి సమావేశమై, అక్టోబర్ 24న వాయిదా పడింది. డిసెంబర్ 10న మళ్లీ సమావేశమయ్యేలా నిర్ణయించారు. ఇప్పుడు 88 రోజుల జాప్యంతో కొత్త రికార్డు నమోదవడం, డీలిమిటేషన్ బిల్లులపై రాజకీయ చర్చకు మరింత ఊతమిస్తోంది.

 

#IndianParliament #ParliamentSession #88DayRecord #ParliamentProrogation #DelimitationBill #WomenReservationBill #LokSabha #RajyaSabha #SpecialParliamentSession #ConstitutionalAmendment #IndianPolitics #PoliticalNews