బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్ ఉధృతి.
500 మీటర్ల పరిధిలో ప్రజల తరలింపు.
తెల్లవారుజామున భారీ శబ్దం.. గ్యాస్ లీకేజీ.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బావి వద్ద మంగళవారం తెల్లవారుజామున భారీ శబ్దంతో గ్యాస్ వెలువడటం కలకలం రేపింది. రాజోలు నియోజకవర్గంలోని నగరం గ్రామ పరిధి తాడివారిమెరక సమీపంలో డ్రిల్లింగ్ బావి వద్ద వర్కోవర్ పనులు జరుగుతుండగా ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్యాస్ ఉధృతంగా బయటకు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రాజమండ్రి విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. 500 మీటర్ల పరిధిని దిగ్బంధించి, సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కిలోమీటరు పరిధిలోని గ్రామాల ప్రజలకు నగరం పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించారు. జాతీయ రహదారి 216పై వాహనాల రాకపోకలు నిలిపివేసి దారి మళ్లించారు.
లీకేజీ నియంత్రణకు ఓఎన్జీసీ చర్యలు
ఓఎన్జీసీ అత్యవసర స్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించాయి. నర్సాపూర్ ప్రాంతీయ సంక్షోభ నిర్వహణ కేంద్రం నుంచి అదనపు సిబ్బంది, పరికరాలను రప్పించారు. ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, నీటి తెరను ఏర్పాటు చేశారు. గ్యాస్ సాంద్రత పరీక్షల్లో పరిశీలించిన ప్రాంతాల్లో సున్నా నమోదైనట్లు సంస్థ వెల్లడించినా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. లీకేజీని సురక్షితంగా నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయంగా చర్యలు చేపట్టింది.
భద్రతా ఆడిట్‌కు పవన్ కళ్యాణ్ ఆదేశం
ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు. వరుస బ్లోఅవుట్ ఘటనల నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి గ్యాస్ బావుల భద్రతపై సమగ్ర తనిఖీలు, సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. సిబ్బంది, స్థానికుల ప్రాణరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
#KonaseemaGasLeak #ONGC #GasBlowout #NagaramVillage #AndhraPradesh #PawanKalyan #GasWellSafety #EmergencyEvacuation











