Home National_news చంపేస్తారా ఏంటి? రాళ్ల దాడిపై మమత ఆగ్రహం! హలిసహర్‌లో దీదీ కారుపై దాడి

చంపేస్తారా ఏంటి? రాళ్ల దాడిపై మమత ఆగ్రహం! హలిసహర్‌లో దీదీ కారుపై దాడి



పశ్చిమ బెంగాల్‌లో మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని హలిసహర్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసినట్లు మమత ఆరోపించారు. ఈ దాడిలో తాను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల పగిలిపోయేదన్న మమత

పోలీసు కస్టడీలో మరణించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ కార్యకర్త బిర్జు కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమత హలిసహర్‌కు వెళ్లారు. ఆమె కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. కారుపై బురద పూయడంతో పాటు చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరినట్లు సమాచారం. ఈ సమయంలో “చోర్ భగావో” అంటూ నినాదాలు వినిపించాయి. దాడి తర్వాత మీడియాతో మాట్లాడిన మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అసాంఘిక శక్తులు తన కారుపై రాళ్లు విసిరారని ఆరోపించారు. కారు అద్దాలు మూసి లేకపోతే ఇటుకలు, రాళ్లు తగిలి తన తల పగిలిపోయేదని, తాను చనిపోయే అవకాశం కూడా ఉండేదని అన్నారు.

పోలీసులపై తీవ్ర ఆరోపణలు

తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని మమత ఆరోపించారు. బీజేపీకి మాత్రమే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. ఆమె వెంట ఉన్న లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డోలా సేన్ కూడా పోలీసు వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తృణమూల్ నేతలు బీజేపీపై విమర్శలు చేశారు. ఎంపీ కల్యాణ్ బెనర్జీ, పోలీసులను ఉపయోగించి సువేందు అధికారి వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపించారు. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఈ దాడిని ఖండించారు. ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పార్టీ కార్యకర్త మృతిపై వివాదం

మమత పరామర్శించేందుకు వెళ్లిన బిర్జు కియోట్‌ను ఎక్స్‌టార్షన్ కేసులో అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అయితే కియోట్‌ను లాకప్‌లో చిత్రహింసలకు గురిచేసి కొట్టడంతో మరణించాడని ఆయన భార్య, మాజీ తృణమూల్ కౌన్సిలర్ జెన్నీ శర్మ ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా కియోట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. పోలీసు కస్టడీలోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి రాకపోతే అది కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, న్యాయపాలనపై ప్రశ్న అని వ్యాఖ్యానించారు. కస్టడీ మరణం ఆరోపణలపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.

 

#MamataBanerjee #Halisahar #WestBengalPolitics #TMC #TrinamoolCongress #BJP #StonePelting #MamataBanerjeeAttack #HalisaharIncident #WestBengalNews #KalyanBanerjee #AbhishekBanerjee #BirjuKiyot #PoliceCustodyDeath #SuvenduAdhikari #PoliticalViolence #MamataBanerjeeNews #IndiaPolitics #BreakingNews