Home Telangana మా ఆస్తులు.. మీ ఆస్తులు లెక్కలు తేల్చేద్దాం

మా ఆస్తులు.. మీ ఆస్తులు లెక్కలు తేల్చేద్దాం

సీఎంకే కేటీఆర్ సవాల్ .

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారితీసింది. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన భూవ్యవహార ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. మొదట కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌ పరిధిలో 1,000 ఎకరాల భూమి ఉందని చెప్పి, ఇప్పుడు 67 ఎకరాలేనని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. 67 ఎకరాల వివరాలు కేసీఆర్‌ ఎన్నికల అఫిడవిట్‌లోనే ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌పై చేసిన ఆరోపణలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ ప్రభుత్వం భూముల అంశాన్ని రాజకీయంగా ఉపయోగిస్తోందని కేటీఆర్‌ విమర్శించారు.

అమెరికా ఉద్యోగం ప్రస్తావన

తన ఆస్తులపై ప్రశ్నలు లేవనెత్తడాన్ని కేటీఆర్‌ తప్పుబట్టారు. తాను అమెరికాలో ఆరున్నర సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించానని, తన ఆస్తులకు సంబంధించిన వివరాలు బహిరంగంగానే ఉన్నాయని అన్నారు. రేవంత్‌రెడ్డి గత జీవితం గురించి తనకు తెలుసంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండారెడ్డిపల్లికి వెళ్లి వివరాలు అడిగితే అక్కడి వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు వ్యవసాయ భూములు మొదటి నుంచే ఉన్నాయని, కుటుంబానికి పూర్వం నుంచే ఆస్తులు ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.

బంధువుల భూములు ఎందుకు కలిపారు?

కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తుల ఆస్తులను కూడా వారి ఖాతాలో కలిపి చూపుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కూకట్‌పల్లికి చెందిన కొండల్‌రావుతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని, కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందినవారనే కారణంతో ఆయన ఆస్తులను తమ కుటుంబానికి ఆపాదించారని అన్నారు. నవీన్‌రావు, ఇతర బంధువుల ఆస్తులను కూడా కేసీఆర్‌ కుటుంబ భూముల లెక్కల్లో కలపడం సరికాదని ప్రశ్నించారు. ఇదే సమయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎర్రవల్లి భూములపై విచారణకు ఆదేశించింది. సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న ఆరోపణలపై సర్వే, విచారణ కొనసాగుతోంది.

#KTR #RevanthReddy #KCR #Erravelli #ErravelliLand #KCRFarmhouse #KTRChallenge #TelanganaPolitics #BRSPolitics #BRS #KCRAssets #RevanthReddyAssets #LandDispute #GovernmentLand #TelanganaLandSurvey #CongressVsBRS