Home Telangana మద్యం మహమ్మారిపై సమరభేరి!

మద్యం మహమ్మారిపై సమరభేరి!

బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయాల్సిందే.
పోలీసులకు తేల్చి చెప్పిన రాజన్న.

మద్యం మహమ్మారికి మరో కుటుంబం బలైంది. భర్త తాగుడుకు బానిసై పెడుతున్న వేధింపులు, కుటుంబంలో ఎదురవుతున్న కష్టాలను భరించలేక ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన మునుగోడు ప్రాంతంలో కలకలం రేపింది. ఈ విషాదం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని తీవ్రంగా కలచివేసింది. వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు. మరోవైపు అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్‌షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

వారం రోజుల్లో 19 గ్రామాల జాబితా ఇవ్వాలి!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం స్థానిక ఎస్సైతో ఫోన్‌లో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. 19 గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడ ఏం జరుగుతుందో పోలీసులు నిరంతరం గమనించాలని, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని ఆదేశించారు. “ఇక్కడ పని చేయాలంటే బెల్ట్‌ షాప్‌లను కంట్రోల్ చేయడమే మొదటి కండిషన్” అని స్పష్టం చేశారు. వారం రోజుల్లో 19 గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది అక్రమ సారాయి విక్రయిస్తున్నారో పూర్తి జాబితా సిద్ధం చేసి తనకు అందించాలని ఆదేశించారు. “లేకపోతే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు” అంటూ పోలీసులకు తేల్చి చెప్పారు.

తాగుడు కష్టాలు.. కన్నీటి గాథలు!

మద్యం కారణంగా కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతున్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. భర్త తాగుడుకు బానిసై అప్పులపాలవడం, మద్యం తాగి వచ్చి భార్యను వేధించడం చివరకు ఆమె ప్రాణాలు తీసుకునే పరిస్థితికి దారితీయడం బాధాకరమన్నారు. “తాగుడు ఎక్కువై ఇలాంటి కష్టాలు వస్తున్నాయి.. ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్‌షాపుల నిషేధం కేవలం ఒక నిర్ణయం కాదని, ఎన్నో కుటుంబాలను, ప్రాణాలను కాపాడే బాధ్యత అని పేర్కొన్నారు.

పిల్లల చదువు బాధ్యత నాదే!

తల్లిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారులను చూసి రాజగోపాల్‌రెడ్డి చలించిపోయారు. వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ తక్షణ ఆర్థిక సాయంగా రూ.10 వేల నగదును అందజేశారు. అంతటితో ఆగకుండా పిల్లలు పదో తరగతి వరకు చదువుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఫౌండేషన్‌ తరఫున వారి చదువు ఫీజులు, ఇతర విద్యా ఖర్చులన్నీ పూర్తిగా భరించాలని స్పష్టం చేశారు.

మరో కుటుంబానికి ఇలాంటి విషాదం వద్దు!

మద్యం వ్యసనం ఒక్క వ్యక్తినే కాకుండా కుటుంబం మొత్తాన్ని ఎలా కుంగదీస్తుందో ఈ ఘటన చాటిచెబుతోంది. అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్‌షాపుల నియంత్రణపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే చేసిన హెచ్చరిక ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధిత పిల్లల చదువు బాధ్యత తీసుకోవడంతో పాటు, ఇలాంటి విషాదాలు మరే కుటుంబంలోనూ పునరావృతం కాకూడదన్న లక్ష్యంతో ఆయన స్పందించారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటానన్న తన మాటకు కార్యరూపం చూపించే ప్రయత్నం చేశారు.

 

#KomatireddyRajGopalReddy #Munugode #BeltShops #IllegalLiquorSales #LiquorAddiction #TelanganaPolice #TelanganaPolitics #FamilyWelfare #ChildEducation #AlcoholAwareness