హర్మూజ్‌కు ప్రత్యామ్నాంగా ప్రతిపాదన.
కొత్త రైల్వే మార్గంపై విస్తృత ప్రచారం.
హర్మూజ్ జలసంధి, బోస్ఫరస్ మార్గాల్లో పెరుగుతున్న భద్రతా ముప్పుల నేపథ్యంలో రష్యా కీలక ప్రతిపాదన చేసింది. రష్యా నుంచి ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మీదుగా హిందూ మహాసముద్రానికి రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని రష్యా ఉప ప్రధాని మరాత్ ఖుస్నులిన్ సూచించారు. ఈ మార్గం ద్వారా భారత్‌కు ప్రత్యక్షంగా చేరుకునే అవకాశాలను కూడా పరిశీలించాలని ఆయన తెలిపారు.
హర్మూజ్‌లో పెరుగుతున్న ప్రమాదం
ప్రపంచ ఇంధన రవాణాలో హర్మూజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 25 శాతం, ఎల్‌ఎన్‌జీ రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండా సాగుతుంది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో రవాణాకు అంతరాయాలు ఏర్పడితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. బ్లాక్ సీ నుంచి రష్యా చమురు ఎగుమతులకు బోస్ఫరస్ కీలక మార్గంగా ఉంది. 2025 తొలి ఆరు నెలల్లో ఈ జలసంధి ద్వారా రోజుకు సుమారు 33 లక్షల బ్యారెళ్ల ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు రవాణా అయినట్లు సమాచారం. బోస్ఫరస్‌పై టర్కీ నియంత్రణ ఉండటంతో రష్యా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి పెడుతోంది.
రైలు మార్గంలో భారీ సవాళ్లు
రష్యా ప్రతిపాదించిన మార్గం ఆచరణలోకి రావడం అంత సులభం కాదు. ప్రతిపాదిత రూట్ టర్క్‌మెనిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మీదుగా సాగాల్సి ఉంటుంది. ఈ దేశాల మధ్య రాజకీయ సంబంధాలు, భద్రతా సమస్యలు పెద్ద అవరోధాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఆఫ్ఘనిస్థాన్, భారత్‌తో ఉన్న విభేదాలు ఈ ప్రాజెక్టుకు సవాలుగా నిలవొచ్చు. ఈ ప్రతిపాదనతో టర్క్‌మెనిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్-ఇండియా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు మరోసారి గుర్తుకు వస్తోంది. సుమారు 1,800 కిలోమీటర్ల పొడవైన టీఏపీఐ ప్రాజెక్టు ద్వారా మధ్య ఆసియా నుంచి భారత్‌కు చౌకైన సహజ వాయువు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భద్రత, నిధులు, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తిగా అమల్లోకి రాలేదు.
భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం
రష్యా ప్రతిపాదించిన రైలు మార్గం నిజంగా రూపుదిద్దుకుంటే భారత్‌కు కొత్త వాణిజ్య మార్గం అందుబాటులోకి రావచ్చు. సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మీదుగా రవాణా భద్రతను ఎలా నిర్ధారించాలన్నదే ప్రధాన ప్రశ్నగా మారనుంది. హర్మూజ్‌లో ఉద్రిక్తతలు, బోస్ఫరస్‌పై భౌగోళిక నియంత్రణ నేపథ్యంలో రష్యా ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అన్వేషణను వేగవంతం చేస్తున్నట్లు ఈ ప్రతిపాదన స్పష్టం చేస్తోంది. భారత్‌కు హిందూ మహాసముద్రం ద్వారా చేరుకునే కొత్త రైలు మార్గం ఆలోచన ఇప్పటికైతే ప్రతిపాదన దశలోనే ఉన్నా, భవిష్యత్ వాణిజ్య భద్రతపై దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడే అవకాశం ఉంది.
#IndiaRussiaRailCorridor #IndiaRussiaTradeRoute #RussiaIndiaRailway #AlternativeToHormuz #HormuzStrait #RussiaRailwayCorridor #IndiaRussiaRelations #IndianOceanTradeRoute #IranRailwayCorridor #AfghanistanTradeRoute #PakistanTradeRoute #Turkmenistan #EurasiaTradeCorridor #GlobalTrade #EnergySecurity #Geopolitics #StrategicTransportCorridor #InternationalTrade #RussiaNews #IndiaNews











