Home Telangana జవహర్‌నగర్‌ కోసం ఈటల పాదయాత్ర

జవహర్‌నగర్‌ కోసం ఈటల పాదయాత్ర

డంప్‌ యార్డు తరలింపునకు సమరశంఖం!

జవహర్‌నగర్‌ డంప్‌ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్‌ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఉపగ్రహ సమాచారం ఆధారంగా మీథేన్‌ ఉద్గారాలు అధికంగా ఉన్న ప్రాంతాలపై వెలువడిన నివేదికలో జవహర్‌నగర్‌ డంప్‌ యార్డు ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు తనకు వివరించారని ఆయన తెలిపారు. బ్యూనస్‌ ఐరీస్‌, జకార్తా, కౌలాలంపూర్‌ తర్వాత జవహర్‌నగర్‌ పేరు రావడం ఆందోళనకరమన్నారు. మీథేన్‌ వాయువు గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పులకు ప్రధాన కారణాల్లో ఒకటి అని గుర్తుచేశారు. డంప్‌ యార్డు సమస్యపై అక్టోబర్‌ 23న బాధితులతో సమావేశం, 25న మేధావులు, పర్యావరణవేత్తలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌ 27 నుంచి డంప్‌ యార్డుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.

లక్షలాది మంది చెత్తకు ఒక్క ప్రాంతమేనా?

జవహర్‌నగర్‌ డంప్‌ యార్డును తొలుత రెండు లక్షల మంది జనాభా అవసరాల కోసం ఏర్పాటు చేశారని, ప్రస్తుతం సుమారు కోటి 60 లక్షల మందికి సంబంధించిన చెత్త అక్కడికి వస్తోందని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. డంప్‌ యార్డు చుట్టూ 25 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు దుర్వాసన, కాలుష్యంతో శ్వాసకోశ, చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలు సంపాదించిన డబ్బును వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోందన్నారు. చెత్త నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటిని సమర్థంగా వినియోగించడం లేదని విమర్శించారు. ఐఐటీ బాంబే రూపొందించిన సాంకేతిక పరిష్కారాలను పరిశీలించి అమలు చేయాలని, చెత్తను ఇతర ప్రాంతాలకు పంపిణీ చేసి జవహర్‌నగర్‌పై భారం తగ్గించాలని కోరారు.

శాశ్వత పరిష్కారం కావాలి.. పాదయాత్రకు సిద్ధం

డంప్‌ యార్డు సమస్యపై అఖిలపక్ష సమావేశం జరిగినా శాశ్వత పరిష్కారం లభించలేదని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటనలకే పరిమితం కాకుండా, స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల పరిశోధనలో వెల్లడైన అంశాలను పరిశీలించి, నిపుణుల సూచనలతో కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు. జవహర్‌నగర్‌ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు జీరో పొల్యూషన్‌ లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. డంప్‌ యార్డు తరలింపు, చెత్త నిర్వహణలో మార్పులు, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

 

#EtelaRajender #JawaharnagarDumpYard #DumpYardRelocation #Jawaharnagar #MethaneEmissions #AirPollution #GroundwaterPollution #WasteManagement #Malkajgiri #TelanganaNews #EnvironmentalIssues