Home Telangana కేంద్ర నిధులన్నీ రాబట్టుకోవాలి

కేంద్ర నిధులన్నీ రాబట్టుకోవాలి

వినియోగంలో నిర్లక్ష్యం వద్దనే వద్దు.
శాఖలకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సాధించి, సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో మరింత వేగం పెంచాలని, వాటి ద్వారా ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు అందించాలని స్పష్టం చేశారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బిల్లులు, ఇప్పటివరకు చేసిన ఖర్చులు, పథకాల పురోగతిని శాఖలవారీగా సమీక్షించారు. కేంద్ర పథకాల మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. నిధుల కోసం అవసరమైన దరఖాస్తులు, నివేదికలను సకాలంలో కేంద్రానికి పంపాలని ఆదేశించారు.

ఖర్చుతోపాటు ఫలితాలపైనా నజర్

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి గరిష్ఠంగా నిధులు తీసుకురావాలని భట్టి సూచించారు. ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం నిధులు సమకూరుస్తున్నందున, ఖర్చుల లెక్కలతో పాటు ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను కూడా నిరంతరం పరిశీలించాలని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యక్షంగా ఉపయోగపడే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర శాఖలతో సమన్వయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న లైజన్ అధికారుల సేవలను అన్ని శాఖలు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లోని అంశాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూలధన పెట్టుబడుల కోసం కేంద్రం అందించే ప్రత్యేక సహాయ పథకాన్ని కూడా గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నీటిపారుదల, పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖలు కేంద్ర పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సాంకేతిక సమస్యలు, పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్యలు

కేంద్ర నిధుల విడుదలలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. పథకాల అమలులో పురోగతి ఉంటేనే భవిష్యత్తులో అదనపు నిధులు సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామని, బిల్లులను క్రమబద్ధంగా క్లియర్ చేస్తున్నామని వివరించారు. వివిధ శాఖల్లో పథకాల అమలు, నిధుల ఖర్చు, ప్రస్తుత పరిస్థితిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ సమీక్షలో వివరాలు అందించారు. కేంద్ర నిధుల సాధనతో పాటు వాటి ద్వారా ప్రజలకు పూర్తి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని భట్టి దిశానిర్దేశం చేశారు.

 

#BhattiVikramarka #TelanganaGovernment #CentralFunds #CentrallySponsoredSchemes #TelanganaDevelopment #PendingBills #CapitalInvestment #TelanganaNews