Home AP ఎస్‌ఈసీ నిర్ణయం శిరోధార్యం

ఎస్‌ఈసీ నిర్ణయం శిరోధార్యం

మూడు పార్టీల కీలక ప్రకటన.

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని కూటమి పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పేర్లతో ఉమ్మడి ప్రకటన విడుదలైంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాయి. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నాయి.

స్థానిక ఎన్నికలకు వైసీపీ అడ్డంకులు

వైసీపీ కుట్రపూరిత రాజకీయాలతో ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కూటమి నేతలు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని ఆ పార్టీ గతంలో పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించిందని ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఉన్న అడ్డంకులు తొలగిన సమయంలో హింసను ప్రేరేపించిందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు లేకుండా అన్ని పార్టీలు సహకరించాలని, అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేసే వాతావరణం ఉండాలని కూటమి అభిప్రాయపడింది.

కేంద్ర నిధులు, అభివృద్ధి పనులపై దృష్టి

స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని కూటమి నేతలు పేర్కొన్నారు. గడువులోగా ఎన్నికలు పూర్తి చేసి, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనుకున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపై వైసీపీకి బాధ్యత లేదని వారు విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ద్వారా సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం తమ లక్ష్యమని ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు.

 

#APSEC #AndhraPradesh #LocalBodyElections #ChandrababuNaidu #PawanKalyan #Madhav #AllianceParties #YSRCP #MunicipalElections #ElectionNews #APPolitics