Home Telangana కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది ఎల్‌నినో కాదు.. ఎల్‌కాంగో: కేటీఆర్

కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది ఎల్‌నినో కాదు.. ఎల్‌కాంగో: కేటీఆర్

రాష్ట్రంలో కరెంటు కష్టాలకు ఎల్‌నినో కారణం కాదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో బొగ్గు నిర్వహణలో లోపాలు చోటుచేసుకున్నాయని, సింగరేణి నిల్వలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తిందని పేర్కొన్నారు. అధికారిక రికార్డుల్లో కనిపించిన బొగ్గు వాస్తవంగా ఎక్కడ ఉందనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్‌ పోయింది’’ అంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. విద్యుత్‌ కోతలకు కారణమేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావమని చెబుతోందని.. కానీ కోతలకు కారణం, వాతావరణ పరిస్థితుల కారణంగా కాదని, ‘కాంగ్‌నినో’ ప్రభావంతోనే కరెంట్‌ కోతలు ఎదురవుతున్నాయని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. బొగ్గు కొరత ప్రభావంతో విద్యుత్‌ ఉత్పత్తిపై ఒత్తిడి పెరిగిందని కేటీఆర్‌ ఆరోపించారు. జెన్‌కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేయడం వల్ల రూ.2,900 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 2025–26లో నాసిరకం బొగ్గు కారణంగా జెన్‌కోకు సుమారు 4,338 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి నష్టం, దాదాపు రూ.2,900 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనట్లు ఇంధన శాఖ అధికారులు వెల్లడించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. బొగ్గు నాణ్యత, నిల్వల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు వెల్లడించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

#KTR #RevanthReddy #TelanganaPower #PowerCuts #ElectricityCrisis #Telangana #BRS #Congress #Singareni #CoalShortage #CoalQuality #TGGENCO #PowerCrisis #TelanganaNews #KTRNews