Home AP క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతా

క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతా

క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతా.
ఐటీని ప్రోత్సహిస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.
అంతటా తెలుగువారు నిపుణులుగా ఎదిగారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

అమరావతిని భవిష్యత్‌ సాంకేతికతకు ప్రపంచస్థాయి క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ అమరావతి సదస్సు–2026లో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు నిపుణులుగా ఎదిగారని గుర్తుచేశారు. ఇకపై సిలికాన్‌ వ్యాలీతో పాటు అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచం చర్చించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. సదస్సులో రూ.500 కోట్ల వెంచర్‌ నిధితో డీప్‌టెక్‌ అంకుర సంస్థలకు ఊతమిచ్చే ‘అమరావతి ప్రకటన’ను విడుదల చేశారు. క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ, అర్ధవాహకాలు, అంతరిక్ష–రక్షణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని తెలిపారు.

రూ.500 కోట్లతో కొత్త దూకుడు

ఏపీ ప్రభుత్వం, పాన్‌ ఐఐటీ పూర్వ విద్యార్థుల ప్రతినిధులు కలిసి శాశ్వత పాన్‌ ఐఐటీ మండలిని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, అంకుర సంస్థల మధ్య సమన్వయం పెంచేందుకు ఈ మండలి పనిచేస్తుంది. విద్యాసంస్థల్లో 10 పరిశ్రమల ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయడం, 100 మంది అంతర్జాతీయ ఐఐటీ మార్గదర్శకులతో అంకుర సంస్థలకు శిక్షణ అందించడం, 23 ఐఐటీల నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ చేపట్టడం వంటి లక్ష్యాలను ప్రకటించారు. 2030 నాటికి కనీసం 50 అంకుర సంస్థలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సదస్సులో ‘మేక్‌ ఇన్‌ అమరావతి’లో భాగంగా ఐదు ‘క్యూ–శివ’ క్వాంటం కంప్యూటర్లతో పాటు నాలుగు కెల్విన్‌ ప్రాసెసర్‌ ‘సృష్టి’ని చంద్రబాబు ఆవిష్కరించారు.

తయారీ నుంచి ఎగుమతుల దిశగా

క్వాంటం కంప్యూటర్లను కేవలం వినియోగించే స్థాయి నుంచి వాటిని తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఏపీ ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న క్వాంటం కంప్యూటర్‌ కార్యకలాపాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమరావతి కేంద్రంగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. దేశ అభివృద్ధిలో ఐఐటీ నిపుణులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలని కోరారు. క్వాంటం సాంకేతికత, కృత్రిమ మేధ, అర్ధవాహక రంగాల్లో పెట్టుబడులు, పరిశోధనలకు అమరావతిని కీలక కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు.

 

#AmaravatiQuantumValley #ChandrababuNaidu #PanIITSummit2026 #AmaravatiDeclaration #DeepTech #QuantumComputing #AndhraPradesh #Amaravati #AI #Semiconductors #PanIIT #TechHub #StartupEcosystem