అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక కాలనీ.
ఎర్రవల్లి భూములపై ముఖ్యమంత్రి ఆదేశాలు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రెండు గ్రామాల్లో చేపట్టిన సర్వే వివరాలను సీఎంకు వివరించారు. ఎర్రవల్లి పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు గత వివరాలు ఉండగా, తాజా రెవెన్యూ సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు తెలిపారు. దీంతో మిగిలిన 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. భూమి హద్దులు, రికార్డులను స్పష్టంగా నిర్ధారించేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో ప్రత్యేక సర్వే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
కేసీఆర్ కుటుంబానికి రికార్డుల నోటీసులు
భూముల గుర్తింపు ప్రక్రియలో భాగంగా సర్వే పరిధిలోని భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను సమర్పించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 325లోని భూమి వివరాలు పూర్తిగా తేలిన తర్వాత, అందులోని భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో ఈ భూముల సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. భూమి హక్కులు, సరిహద్దులు, రికార్డులపై స్పష్టత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక కాలనీ
ఇదే సర్వే నంబర్లో తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాల కోసం “తెలంగాణ అమరవీరుల కాలనీ” నిర్మించాలని సీఎం ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి సకల సౌకర్యాలతో కాలనీ ఏర్పాటు చేయాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. జూన్ 2లోగా కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గడువు విధించారు. దీంతో 45 ఎకరాల భూమి ఆచూకీ తేల్చడం, అర్హులైన రైతులకు భూముల పంపిణీ, అమరవీరుల కుటుంబాలకు పక్కా నివాస స్థలాల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించనుంది.
#Erravalli #ErravalliLandRow #45Acres #RevanthReddy #SurveyNo325 #KCR #KCRFamily #TelanganaLandSurvey #Venkatapuram #Siddipet #LandRecords #TelanganaPolitics #MartyrsColony #TelanganaMartyrs #RevenueSurvey











