Home AP ఇంటర్నెట్‌ లేకున్నా టీవీ ప్రసారం

ఇంటర్నెట్‌ లేకున్నా టీవీ ప్రసారం

డేటా లేకుండానే మొబైల్‌లో లైవ్‌ టీవీ!
డైరెక్ట్‌-టు-మొబైల్‌ టెక్నాలజీకి కేంద్రం రెడీ

మొబైల్‌లో లైవ్‌ టీవీ చూడాలంటే ఇప్పటివరకు డేటా, వైఫై లేదా సిమ్‌ కనెక్షన్‌ అవసరమే. కానీ ఇక ఆ పరిస్థితి మారబోతోంది. ఇంటర్నెట్‌ లేకున్నా నేరుగా మొబైల్‌లో టీవీ ప్రసారాలు చూసే రోజులు దగ్గరపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్‌-టు-మొబైల్‌ (డీ2ఎం) టెక్నాలజీని వాణిజ్య స్థాయిలోకి తీసుకురావడానికి అడుగులు వేస్తోంది. ప్రసార భారతి, ఐఐటీ కాన్పూర్‌, తేజస్‌ నెట్‌వర్క్స్‌ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ఇప్పటికే 19కి పైగా నగరాల్లో ప్రయోగ దశను దాటింది. అక్టోబర్‌లో వాణిజ్య అమలుకు ప్రతిపాదనలు ఆహ్వానించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్నెట్‌ సిగ్నల్‌ అందని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇది కొత్త అవకాశాలను తెరవొచ్చు. అయితే ప్రతి మొబైల్‌లో ఈ సేవ వెంటనే అందుబాటులోకి రావడం మాత్రం సాధ్యం కాదు. ప్రత్యేక హార్డ్‌వేర్‌ అవసరం, టెలికాం సంస్థల ఆదాయంపై ప్రభావం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. అయినా డేటా రీచార్జ్‌ లేకుండానే చేతిలోని ఫోన్‌లో టీవీ చూసే అవకాశం నిజమైతే.. మొబైల్‌ వినోద ప్రపంచంలో ఇది పెద్ద మార్పే!

మొబైల్‌లో లైవ్‌ టీవీ చూడాలంటే ఇకపై ఇంటర్నెట్‌ డేటా, వైఫై తప్పనిసరి కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ‘డైరెక్ట్‌-టు-మొబైల్‌’ (డీ2ఎం) టెక్నాలజీని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. సిమ్‌ కార్డు, డేటా కనెక్షన్‌ లేకున్నా మొబైల్‌లో నేరుగా లైవ్‌ టీవీ, వీడియోలు, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను ప్రసారం చేయడం ఈ సాంకేతికత ప్రత్యేకత. ప్రసార భారతి, ఐఐటీ కాన్పూర్‌, తేజస్‌ నెట్‌వర్క్స్‌ కలిసి దీనిని అభివృద్ధి చేశాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 19కి పైగా నగరాల్లో ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. వాణిజ్య అమలుకు అక్టోబర్‌లో రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 470–582 స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో ప్రసారాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

మారుమూల ప్రాంతాలకు భారీ ప్రయోజనం

ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ బలహీనంగా ఉండే గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే దీని విస్తృత వినియోగానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రసారాలను స్వీకరించేందుకు మొబైల్‌ ఫోన్లలో 3.0 ప్రమాణాలకు అనుగుణమైన ప్రత్యేక హార్డ్‌వేర్‌ అవసరం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా స్మార్ట్‌ఫోన్లు దీనికి అనుకూలంగా లేవు. మరోవైపు టెలికాం కంపెనీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీ2ఎం విస్తృతంగా అందుబాటులోకి వస్తే మొబైల్‌ డేటా వినియోగం తగ్గి తమ డేటా ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని టెలికాం సంస్థలు భావిస్తున్నాయి. దీంతో సరికొత్త సాంకేతికతకు అవకాశాలతో పాటు అమలు సవాళ్లు కూడా ముందున్నాయి.

 

#D2M #DirectToMobile #DirectToMobileIndia #LiveTV #TVWithoutInternet #MobileTV #PrasarBharati #IITKanpur #TejasNetworks #D2MTechnology #BroadcastTechnology #DigitalIndia #MobileTechnology #TechNews #IndiaTechnology